జనసేనాని మరోమారు షాకింగ్ కామెంట్స్ చేశారు. తానో ఫెయిల్యూర్ పొలీటీషియన్ను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదారాబాద్‌లోని శిల్పకలా వేదికలో ఇన్ట్సిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సదస్సులో ప్రసంగించిన జనసేనాని ప్రస్తుతం నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ను, దీన్ని నేను అంగీకరిస్తున్నాను. దీనికి నేనేమీ బాధపడటం లేదు అని చెప్పుకొచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు.
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఘోరంగా విఫలమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. గాజువాకలో గెలుస్తారు అనుకున్నా వైసీపీ హావా ముందు పవన్ కల్యాణ్‌కు ఓటమి తప్పలేదు. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని జనసేన గెలుచుకుంది.
ఇక జనసేనాని కూడా వర్థమాన సామాజిక రాజకీయ అంశాలపై ఒక నిర్దుష్టమైన విధానమంటూ పాటించకపోవడంతో ఆ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లలేకపోతోంది. పవన్ రాజకీయ వ్యూహాలు కూడా బెడిసి కొడుతున్నాయి. రాబోయే ఎన్నికలు జనసేనకు చావో రేవో లాంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జనసేనను విజయపథంలో పవన్ కల్యాణ్ నడిపించగలడనేది సందేహాస్పదంగానే మారింది. తనకంటూ సొంతంగా ఒక విధానం లేకుండా జనసేన అధ్యక్షుడు పార్టీని నడిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
బీజేపీ పెద్దలు తనకు రోడ్ మ్యాప్ ఇస్తే ఆ ప్రకారం నడుచుకుంటానని ఆయన ఇప్పటం బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆయనకు ప్రతిబందంగా మారాయి. సొంత అజెండా లేకుండా ఇంకొకరి అజెండా కోసం పార్టీ నడిపే నాయకుడు అంటూ వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు.
ఏపీలో రాబోయే ఎన్నికల్లు అటు వైసీపీ, ఇటు జనసేన, టీడీపీలకు జీవన్మరణ ఎన్నికలుగా మారుతున్నాయి. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఓడించాలని జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని టీడీపీ, జనసేనలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని భావించారు. దీనికి సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య కొన్ని పరిణామాలు కూడా సంభవించాయి. అయితే ఇటీవల ప్రధాన మంత్రి మోడీ వైజాక్ వచ్చినప్పుడు జనసేనాని మోడీని కలిశారు.
ఆ తరువాత ఒక్కసారిగా జనసేన అధినేత వైఖరిలో మార్పు కనిపించింది. టీడీపీతో జత కట్టడానికి బీజేపీ సుముఖంగా లేకపోవడంతో ఈ సారి ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప టీడీపీ జనసేనల మధ్య పొత్తు సూచనలు కనిపించడం లేదు. పొత్తులపైన అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా నోరు మెదపడం లేదు.
వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వను అని మాత్రం జనసేన అధినేత చెబుతున్నారు. అయితే అదెలా సాధ్యమనేదానిపైన జనసేనాని వద్ద క్లారిటీ లేకుండా పోతోంది.
Telugu youth reaction when someone speaks low of Pawan Kalyan pic.twitter.com/x3Bm5nEfBM
— Vishal (@justvishall) December 3, 2022