టాలీవుడ్ కింగ్ నాగార్జున కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) బృందం కుల్చివేత చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా.. ప్రభుత్వ భూములను, చెరువులను రక్షించడం, అక్రమ కట్టడాలను తొలగించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా నిలవడమే లక్ష్యంగా పనిచేస్తుంది.
అయితే గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా కు ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదులు అందాయి. ఖానామెట్‌లోని తమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఫిర్యాదులు చేశారు. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉండగా.. అందులో 1.12 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. 2 ఎకరాలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.
ఇదే విషయంపై ఫిర్యాదులు రాగా.. విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా గుర్తించారు. పక్కా ఆధారాలతో హైడ్రా అధికారులు ఈ రోజు తెల్లవారుజామున మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకుని కూల్చివేతలను ప్రారంభించారు. అయితే ఇంతవరకు నాగార్జున ఈ విషయంపై స్పందించలేదు.