షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నుంచి నాన్ స్టాప్ గా పడుతున్న వానతో హైదరాబాద్ మహానగరంలో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా మంగళవారం రాత్రి 8 గంటల తర్వాత నుంచి హైదరాబాద్ మహానగరంలో అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరి ఆగమాగమైంది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ మహ్మదియా నగర్ లో గోడ కూలిన ఘటనలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
ఒక పహిల్వాన్ కు చెందిన ఫామ్ హౌస్ గ్రానైట్ గోడ కూలి పక్కనే ఉన్న రెండు ఇళ్ల మీద పడటం.. దీంతో.. ఆ రెండు కుటుంబాల వారు మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో మరో నలుగురు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. గోడ కూలినందుకే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుంటుందా? అన్న సందేహంతో ఈ ఉదంతాన్ని చూస్తే.. కూలిన గోడ గ్రానైట్ తో నిర్మించింది కావటం.. పడిన రెండు ఇళ్ల గోడలు చాలా పాతవి కావటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
ఓవైపు జోరున వర్షం.. మరోవైపు విద్యుత్ సరఫరా లేకపోవటం.. అదే సమయంలో గ్రానైట్ గోడ మృత్యువు రూపంలో విరుచుకుపడటంతో ఎనిమిది మంది ఉసురు తీసింది. ఈ విషాదం గురించి తెలిసినంతనే మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఆయన సోదరుడు కమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. గోడ కూలిన ఘటనలో ఇంత మంది మరణానికి కారణం ఏమై ఉంటుందన్న విషయంపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.