గ్రేటర్ ఎన్నికల ప్రచారం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా గ్రేటర్ ప్రచారం సాగింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం నమోదు చేసిన నేపథ్యంలో.. బలోపేతమైన ఆ పార్టీ ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. షెడ్యూల్ కంటే ముందే నిర్వహిస్తున్న ఈ ఎన్నిక విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లానింగ్ కు భిన్నమైన పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మహానగరంలో బీజేపీ బలం పరిమితమైనప్పటికి.. తాజా ఎన్నికల పుణ్యమా అని డివిజన్ స్థాయిలో ఆ పార్టీ బలోపేతం కావటమే కాదు.. మెజార్టీ డివిజన్లలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగుతోంది.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయటానికి పెద్ద ఎత్తున నేతలు పలు రాష్ట్రాల నుంచి రావటం తెలిసిందే. శనివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నగరంలో పర్యటించారు. కుకట్ పల్లి నియోజకవర్గం నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు.. పాతబస్తీలోని లాల్ దర్వాజా ప్రాంతంలోనూ ఆయన పర్యటించారు. అక్కడి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని చూస్తే.. ఒక ఆసక్తికర ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
హైదరాబాద్ నగర ప్రజలు సహకరిస్తే.. భాగ్యనగరిగా పేరును మారుస్తామన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలంటే ప్రజలు బీజేపీనే గెలిపించాలన్నారు. వరద సాయాన్ని బ్యాంకులో వేయకుండా నేరుగా నగదు రూపంలో ఎందుకు పంచినట్లు? అని ప్రశ్నించిన ఆయన.. హైదరాబాద్ లోని నిజాం నిరంకుశ పాలనను సర్దార్ వల్లభాయ్ పటేల్ చరమగీతం పాడిన విషయాన్ని గుర్తు చేశారు.
మజ్లిస్.. టీఆర్ఎస్ పార్టీలు వారి కుటుంబాల అభివృద్ధికే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్న ఆయన.. యూపీలో 10 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలుచేస్తుంటే.. తెలంగాణలో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. యోగి మాటల్ని చూస్తే.. హైదరాబాద్ పేరును భాగ్యనగరిగా మార్చే ప్రతిపాదన తెర మీదకు వచ్చినా.. ఆచరణలో అదేమీ అంత తేలికైన విషయం కాదు. .. గ్రేటర్ పీఠాన్ని బీజేపీ సొంతం చేసుకున్నంతనే ఈ మార్పు జరగదు. తెలంగాణలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పాలి.