తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆరా మజాకానా? ఆయన నోటి నుంచి వచ్చే మాటకు.. ఆయన చేసే ట్వీట్ కు అధికార గణం ఎంతలా పరుగులు తీస్తూ నిర్ణయాలు తీసుకుంటుందో ఇటీవల చూస్తూనే ఉన్నాం. ఆ మధ్యన కేటీఆర్ ముచ్చటపడి డబుల్ డక్కర్ బస్సుల గురించి మాట్లాడితే.. దాని గురించి భారీ ఎత్తున కసరత్తు చేశారు కానీ.. టెక్నికల్ సమస్యలతో బస్సుల్ని రోడ్ల మీదకు తీసుకురాలేకపోయారు.
కానీ.. హుస్సేన్ సాగర్ మీద ఆదివారం సాయంత్రం పూట ట్రాఫిక్ ఆపేసి.. హైదరాబాదీలకు వారాంతం ఎంజాయ్ చేయాలన్న సూచనకు కేటీఆర్ ఓకే అనటం.. అందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేయటం తెలిసిందే. నిన్న (సోమవారం) ఉదయం మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసిన ఒక ట్వీట్ లో హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్చాలని.. దూర ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చేవారికి ఉదయంపూట మెట్రో ఎక్కటం చాలా ఇబ్బందిగా ఉందంటూ అభినవ్ సుదర్శి అనే ఒక నెటిజన్ ట్వీట్ చేయటం..పెద్ద వయస్కులు.. మహిళలు పడుతున్న ఇబ్బందుల్ని వీడియో తీసి రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.
ఇందుకు స్పందించిన కేటీఆర్ అతని అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్ నుంచి అంత మాట వచ్చాక మెట్రో అధికారులు ఊరుకుంటారా? యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేసి.. కేటీఆర్ ట్వీట్ వెలువడిన 24 గంటల వ్యవధిలోనే హైదరాబాద్ మెట్రో రైల్ టైమింగ్స్ ను మార్చేస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా హైదరాబాద్ మెట్రో అధికారులు చేసిన ప్రకటన ప్రకారం నవంబరు 10 (రేపటి) నుంచి ఉదయం ఆరు గంటలకే మెట్రో రైళ్లు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11. 15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మొత్తంగా కేటీఆర్ ట్వీట్ చేసినంతనే అందుకు తగ్గట్లు సానుకూల ఫలితం రావటంతో కేటీఆరా మజాకానా అనకుండా ఉండలేని పరిస్థితి.