ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్ర రాజధానిపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటలకు భిన్నంగా.. ప్రభుత్వాన్ని కొలువు తీర్చిన కొద్దికాలానికే మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకురావటం.. దానిపై మొదలైన చర్చ రచ్చగా మారింది. ప్రభుత్వం సైతం వెనక్కి తగ్గకుండా తాను మూడురాజధానుల విషయంలో కచ్ఛితంగా ఉందన్న సంకేతాల్ని పంపటమే కాకుండా అందుకు తగ్గట్లుగా నిర్ణయాల్ని తీసుకుంది.
మూడు రాజధానుల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం.. అమరావతి రైతులు సుదీర్ఘ పోరాటానికి తెర తీయటంతో పాటు.. పలువురు మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. ఇటీవల హైకోర్టు ధర్మాసనం తీర్పును ఇస్తూ.. ఏపీ రాజధానిగా అమరావతినే అని తేల్చింది. ఇదిలా ఉంటే.. ఏపీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల వేళలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తుంటే టీడీపీ నేతలు నినాదాలతో సభను హోరెత్తించారు.
ఇలాంటివేళ.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ.. రాజధాని అంశంపై సరికొత్త వ్యాఖ్యలు చేశారు.
2024 వరకు మన రాజధాని హైదరాబాదేనని.. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు మాట్లాడి ఉంటాయన్నారు. రాజధానిని తాము గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంటుకు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుందన్న బొత్స మాటలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. అమరావతి.. హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవని.. తమ ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమేనని బొత్స చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఇప్పటికి మూడు రాజధానుల మాట మీదనే జగన్ సర్కారు ఉందన్న విషయం అర్థమవుతుంది.
ఇటీవల హైకోర్టు ధర్మాసనం తీర్పును ఇస్తూ.. అమరావతే రాజధాని.. అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ చేపట్టాలని చెప్పిన తర్వాత కూడా మూడు రాజధానులపై జగన్ సర్కారు ఆలోచన ఏ రీతిలో ఉందన్న విషయాన్ని తెలిపేలా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు.