తెలంగాణ రాజధాని హైదరాబాద్కు భాగ్య నగరం అనే పేరుంది. భాగమతి అనే పట్టపురాణి ఇక్క డున్న కారణంగా ఈ నగరానికి భాగ్య నగరం అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. అయితే.. చరిత్ర ఎలా ఉన్నా.. ఇప్పుడు ఈ నగరం.. నిజంగానే `భాగ్య` నగరంగా మారిందని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. తెలంగాణకు తీర ప్రాంతం లేదు. అయినా కూడా పుంజుకుంది. అదే ఏపీలో ఎంతో తీరప్రాంతం ఉంది. పెట్టుబడులకు అవకాశం ఉంది. అయినా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్వాకం కారణంగా ఏపీ పూర్తిగా వెనుకబడిపోయిందని అంటున్నారు మేధావులు.
విషయం ఇదీ..
ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు `హెన్లీ అండ్ పార్ట్నర్స్` సంస్థ అధ్యయనం వెల్లడించింది. పది లక్షల డాలర్లకు (మన కరెన్సీలో దాదాపు రూ.8.2 కోట్లు) పైగా ఆస్తులు ఉన్న వ్యక్తులను మిలియనీర్లు గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 97 నగరాలు ఈ జాబితాలో చోటుదక్కించుకోగా హైదరాబాద్కు 65వ స్థానం లభించింది.
భారత్ నుంచి 59,400 మంది మిలియనీర్లతో ముంబయి 21వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్ నగరం తొలి స్థానం పొందింది. అలానే 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్లో అత్యధిక నికర సంపద ఉన్న వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. దేశాలు, నగరాల మధ్య సంపద వలస పోకడలను పరిశీలించే స్వతంత్ర పరిశోధన సంస్థ న్యూ వరల్డ్ వెల్త్ సహకారంతో అధ్యయన ఫలితాలను వెల్లడించినట్లు హెన్లీ అండ్ పార్ట్నర్స్ పేర్కొంది.
ఐదుగురు బిలియనీర్లు.. ఇక్కడే!
హైదరాబాద్లో 40 మంది సెంటీ మిలియనీర్లు, అయిదుగురు బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 100 మిలియన్ అమెరికా డాలర్ల (రూ. 822 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులను సెంటీ మిలియనీర్లుగా, ఒక బిలియన్ డాలర్ల (రూ.8,225 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉంటే బిలియనీర్లుగా పరిగణిస్తారు. మరి ఈ పరిస్థితి ఏపీలో ఉందో లేదో.. సీఎం జగన్ సహా వైసీపీ నాయకులు ఆలోచించుకోవావలని పరిశీలకులు కోరుతున్నారు.