గతంతో పోలిస్తే న్యాయస్థానాలు తమ ముందుకు వచ్చిన నివేదికలు.. వాదనలు.. ఆధారాల్నిచూసినప్పుడు కఠినంగా స్పందించటం ఈ మధ్యన పెరిగింది. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ధోరణి మీడియాలోనూ భారీగా ఫోకస్ అవుతోంది. తాజాగా అలాంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఎదురైంది. కరోనా పరీక్షలు ఆకస్మికంగా సగానికి పైనే ఎందుకు తగ్గాయో చెప్పాలంటూ ప్రభుత్వాన్నికోరింది రాష్ట్ర హైకోర్టు.
కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్యకు సంబంధించిన నివేదికలు నమ్మశక్యంగా లేవని పేర్కొన్నారు. అక్టోబరులో రోజుకు పది మంది మరణిస్తున్నట్లు చూపుతున్నారని.. ఈ రాష్ట్రంలో రోజుకు పదికి మించిన రోగుల్ని తీసుకెళ్లొద్దని యముడికి ఆదేశాలు ఇచ్చారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ప్రభుత్వం నిర్వహించాల్సిన పరీక్షలు.. సౌకర్యాల కల్పనతో పాటు.. మృతదేహాలకూ పరీక్షలు నిర్వహించాలంటూ 23 పిల్స్ రాష్ట్ర హైకోర్టు దాఖలయ్యాయి. వీటిని విచారించే క్రమంలో టీ హైకోర్టు ధర్మాసనం తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రభుత్వం ఇస్తున్న లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని కోర్టు పేర్కొంది. ప్రజలకు కచ్ఛితమైన వివరాల్ని అందించాలన్న కోర్టు.. మరనాల్ని పదికి మించటంలేదని.. కోవిడ్ ఆసుపత్రులు కేవలం 62 మాత్రమే ఉన్నట్లు చెబుతూ.. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ ఆసుపత్రులు ఉన్నాయని.. కేవలంపది శాతం జనాభాకు మాత్రమే పరీక్షలు చేయటం ఏమిటి?అని ప్రశ్నించారు.
ఆక్సిజన్ పడకలు(831).. ఐసీయూ పడకల్ని(352)కు పెంచి.. సాధారణ పడకలు (367)తగ్గించి ఏం సంకేతాలు ఇస్తున్నట్లు అంటూ ప్రశ్నించిన మైకోర్టు.. రాష్ట్రం మొత్తమ్మీదా చూస్తే.. ఇది బకెట్ లో నీటి బొట్టంత కూడా కాదున్నారు. కరోనా పరీక్షల్ని అకస్మాత్తుగా ఎందుకు తగ్గించారో కూడా చెప్పాలని కోరితే రోజకు 54,219 టెస్టులు సరాసరిన చేసినట్లుగా చెప్పి అతితెలివి ప్రదర్శించారని పేర్కొనటం గమనార్హం.
17 ఆర్టీపీసీఆర్ ల్యాబులు ఉన్నాయని.. మరో ఆరు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. వాటిని ఎప్పటి లోపు ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని చెప్పక పోవటాన్ని తప్పు పట్టారు. కోవిడ్ ఆసుపత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డులు ఏరపాటు చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు అమలు చేసింది లేదన్నారు. నిరుపేదలు.. అభాగ్యులు.. ఫుట్ పాత్ ల మీద జీవించే వారికి పరీక్షల కోసం పది వ్యాన్లుఎలా సరిపోతాయని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి ఇరుగుపొరుగున ఉన్న మహారాష్ట్ర.. ఏపీ.. తమిళనాడు .. కర్ణాటక.. ఢిల్లీ రాష్ట్రాల్లో జులై నుంచి అక్టోబరు మధ్య కాలంలో వారు చేసిన పరీక్షలు.. అక్కడ నమోదైన కేసులు.. మరణాల్ని గ్రాఫిక్స్ రూపంలో సిద్ధం చేసి తమకు ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తాము పేర్కొన్న వివరాల్ని ఈ నెల పదహారు లోపు నివేదికను ఇవ్వాలని.. విచారణను ఈ నెల 19కు వాయిదా వేశారు.