తెలంగాణలో ఇటీవల కాలంలో కిడ్నాప్ లు పెరుగుతున్నాయి. తాజాగా ఒక వైద్యుడ్ని కిడ్నాప్ చేసిన వైనం తీవ్ర కలకలాన్ని రేపితే.. సమయస్ఫూరితో పాటు.. సాహసోపేతంగా ఈ ఇష్యూను ఛేధించారు ఏపీకి చెందిన అనంతపురం పోలీసులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు.. వైద్య సేవల్ని అందించే డాక్టర్ గా సుపరిచితులు 57 ఏళ్ల బెహజత్ హుస్సేన్. బండ్లగూడ జాగీర్ ప్రధాన రహదారిపై సొంత ఇంట్లో క్లినిక్ ను నిర్వహిస్తుంటారు. మంగళవారం రోగుల్ని చూస్తున్న ఆయన బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం ప్రాంతంలో రోగుల రద్దీ కాస్త తగ్గింది. దీంతో భోజనానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
ఆ సమయంలో క్లినిక్ లో డాక్టర్ తో పాటు.. ఆయన అసిస్టెంట్ సల్మాన్ మాత్రమే ఉన్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు నల్లటి బురఖాలు ధరించిన క్లినిక్ లోపలకు వచ్చారు. వైద్యుడి సహాయకుడు సల్మాన్ ను తీవ్రంగా కొట్టారు. మూతికి ప్లాస్టర్ వేసి.. కాళ్లు.. చేతులు కట్టేసి బాత్రూంలో పడేశారు. ఆ తర్వాత వైద్యుడ్ని కొట్టారు.
వైద్యుడ్ని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి.. ఆయన ఇన్నోవా కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు.గాయాలైన అసిస్టెంట్ సల్మాన్ బాత్రూం నుంచి బయటకు వచ్చి.. వైద్యుడి ఇంట్లో పని చేసే తన తండ్రికి ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించారు. విషయం తెలుసుకున్నంతనే శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి.. సీపీ సజ్జన్నార్ ఘటనా స్థలానికి చేరుకొని సమాచారాన్ని సేకరించారు. ఆస్తి తగదాలతో బంధువులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు.
అనంతరం ఇన్నోవా వాహనాన్ని పట్టుకునేందుకు వీలుగా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారాన్ని అందించారు. కిడ్నాప్ చేసిన వారు అనంతపురం మీదుగా బెంగళూరు వెళుతున్న వైనాన్ని గుర్తించి.. అక్కడి పోలీసుల్ని అలెర్టు చేశారు. దీంతో అలెర్టు అయిన వారు రాప్తాడుకు సమీపంలో నిఘా పెట్టిన పోలీసులు.. ఇన్నోవాను గుర్తించారు. వెంటనే వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో ఇద్దరు కిడ్నాపర్లు అనంత పోలీసుల చేతికి చిక్కగా.. మరో ఇద్దరు తప్పించుకుపోయారు. దీంతో.. తీవ్ర ఉత్కంట రేపిన కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. అయితే.. తప్పించుకున్న ఇద్దరు కిడ్నాపర్లను పట్టుకునే పనిలో ఏపీ పోలీసులు పడ్డారు. కిడ్నాప్ కు గురైన వైద్యుడ్ని హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు.