ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటే ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేసుకుంటు పోతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఒక వాహనదారుడికి ఫైన్ వేశారు. చలానా కట్టాలని పోలీసులు వాహనదారుడిని అడుగుతుండగానే యజమాని టూ వీలర్ ను వదిలేసి పారిపోయాడు. విషయం ఏమిటని ఆరా తీసిన పోలీసులకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది.
ఇంతకీ విషయం ఏమిటంటే సదరు టూ వీలర్ మీద ఇప్పటివరకు 179 చలానాలు పెండింగ్ లో ఉన్నాయట. అంటే వాహనదారుడు కట్టాల్సిన మొత్తం ఫైన్ సుమారు రు. 42 వేలకు చేరుకుందట. 2015 నుండి ట్రాఫిక్ నిబంధనలకు చలానాలు అందుతున్నా వాటిల్లో ఒక్క చలానాకు కూడా ఫైన్ కట్టలేదట. వాహనం నెంబర్ ప్లేటు ఆధారంగా వివరాలు సేకరిస్తే మెదక్ జిల్లాకు చెందిన పి. రత్నయ్య పేరుమీద టూవీలర్ రిజిస్టర్ అయ్యుందని తెలిసింది. మరి చలానాలు కట్టకుండా ఎందుకని యజమాని వెళ్ళిపోయారు ?
ఎందుకంటే రు. 42 వేలు ఫైన్ కట్టే బదులు కొత్త టూవీలరే కొనుక్కోవచ్చని అనుకున్నారేమో. అసలు ఇన్నేసి చలానాలు కట్టకుండా ఎలా తిరుగుతున్నారు ? ఎలాగంటే ట్రాఫిక్ రూల్సును అతిక్రమించిన వారితో ఫైన్ కట్టించుకోవాలే కానీ వాళ్ళ వాహనాలను సీజ్ చేయవద్దని కోర్టు ఆదేశించింది కాబట్టే. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం టూవీలర్ రిజిస్టర్ ప్రకారం అడ్రస్ కు చలానాలు వెళుతుంటాయి. ఒక్కోసారి యజమాని ఆర్టీఏ యాప్ డౌన్లోడ్ చేసుకునుంటే ఆ యాప్ కు చలానాలు వెళుతుంటాయి.
చలానాలు వెళుతుంటాయే కానీ యజమానులు ఫైన్ మాత్రం కట్టరు. అదే గతంలో అయితే బండిని పోలీసులు సీజ్ చేసేవారు. దాంతో వేరే దారిలేక వెంటనే ఫైన్ కట్టి బండిని విడిపించుకునే వాళ్ళు. అయితే కోర్టు ఆదేశాల వల్ల బండిని సీజ్ చేసే అవకాశం లేకపోవటంతో వాహన యజమానులకు బాగా వెసులుబాటు దొరుకుతున్నట్లుంది. అందుకనే ఎన్ని చలానాలు వచ్చినా, ఎంత కట్టాల్సున్నా యజమానులు లెక్కే చేయటంలేదు.
తాజాగా చలానా అందుకున్న యజమానికి హెల్మెట్ లేకపోవటం, ముగ్గురు ప్రయాణించటం, వన్ వే ట్రాఫిక్ లో వెళ్ళటం, రాంగ్ పార్కింగ్ లాంటి అనేక ఉల్లంఘనల్లో చలానాలు పడ్డాయట. ఇదే కాదు వేలల్లో చలానాలు కట్టని టూవీలర్ యజమానులు చాలామందే ఉన్నారు. ఈమధ్యనే కరీంనగర్ జిల్లాలో కూడా ఒక టూ వీలర్ యజమానికి పోలీసులు చలానా వేయగానే రోడ్డుమీద తన మోటారు బైకును కాల్చేసిన ఘటన సంచలనమైంది. అలా ఎందుకు చేశాడంటే అప్పటికే కట్టాల్సిన ఫైన్ భారీగా ఉండటమే కారణమని తర్వాత తేలింది.