ఇప్పుడున్న హైదరాబాద్ మెట్రో రైలు 69 కి.మీ. మేర ఉంది. తాజాగా రేవంత్ సర్కారు ఓకే చెప్పేసిన మెట్రో విస్తరణ 70కి.మీ. మేర ఉండటం తెలిసిందే. ఫేజ్ 2లో భాగంగా ఈ విస్తరణను వేగంగా చేపట్టాలని భావిస్తున్నారు. అయితే.. ఈ విస్తరణ ప్రాజెక్టుకు ఖర్చు ఎంత? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) ను సిద్ధం చేస్తున్న వేళ.. ఆ రిపోర్టు వస్తే కానీ కచ్ఛితమైన లెక్కలు తేలుతాయని చెబుతున్నారు.
మొత్తం 7 మార్గాల్లో మెట్రో రెండో దశను విస్తరించాలన్న సంగతి తెలిసిందే. విస్తరిస్తున్న ఏడు మార్గాల్లో రెండు మార్గాలకు సంబంధించిన డీపీఆర్ లు ఇప్పటికే ఉన్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కి.మీ. దూరానికి.. నాగోల్ – ఎల్బీ నగర్ వరకు 5కి.మీ. మార్గానికి సంబంధించి డీపీఆర్ లు ఇప్పటికే రూపొందించారు. మిగిలిన 59.5కి.మీ.దూరానికి మాత్రం డీపీఆర్ ను సిద్ధం చేయాల్సి ఉంది.
గత ఏడాది చివర్లో మెట్రో ఫేజ్ 2బికి సంబంధించి 31కి.మీ. ట్రాక్ నిర్మాణానికి రూ.9100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంటే.. కిలో మీటర్ కు రూ.293 కోట్లు ఖర్చు అవుతుందన్నది అంచనా. ఈ లెక్కన 70కి.మీ. మార్గానికి రూ.20వేల కోట్లకు పైనే అవుతుంది. తాజాగా చెబుతున్న ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పుడు అనుకుంటున్న ఫేజ్ 2 కు రూ.17వేల కోట్లే అన్న లెక్కలు వేస్తున్నారు.
అయితే.. కొత్త మార్గాలన్నీ శివారులో ఉండటం.. ఒకట్రెండు మార్గాలు మినహా మిగిలిన చోట్ల భూసేకరణ సమస్య లేకపోవటం కూడా కారణంగా చెబుతున్నారు. ఈ కారణంగా ఖర్చు తక్కువ కానుంది. అయితే.. తాజాగా సిద్ధం చేసిన ఫేజ్ 2కు కేంద్రం తోడ్పాటు అవసరం. ప్రస్తుత అంచనాల ప్రకారం మెట్రో విస్తరణ ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలంటే ఏడాదికి రూ.3500 కోట్ల వరకు వెచ్చించాలి. బడ్జెట్ లో నిధులు కేటాయిస్తేనే పనులు మొదలయ్యే వీలుంది. ఇప్పటివరకున్న ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రం 20 శాతం నిధులు ఇస్తే.. రాష్ట్రం మరో 20 శాతం నిధులు.. మిగిలిన 60 వాతం నిధుల్ని రుణాల రూపంలో సేకరించటం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు. మరి.. కేంద్రం తీరు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.