టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. దాదాపు 20 ఏళ్ల క్రితమే విజన్-2020 అనే నినాదంతో ఉమ్మడి ఏపీలో ఐటీ రంగానికి పురుడు పోసిన దార్శనీకుడు చంద్రబాబు. 1998లో చంద్రబాబు అంకురార్పణ చేసిన హైటెక్ సిటీ నేడు హైదరాబాద్ లో ఐటీ సంస్థలకు మణిమకుటంగా మారింది. ఇక, చంద్రబాబు చొరవతో హైదరాబాద్ లో పాతికేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) కొద్ది రోజుల క్రితం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది.
1999లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ను ఏర్పాటు చేయడంలో ఎంతో చొరవ చూపించారు. ఎంతో ముందు చూపుతో చంద్రబాబు ఏర్పాటు చేయించిన ఆ బిజినెస్ స్కూల్ 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ సంస్థ జరుపుకుంటున్న ద్విదశాబ్ది వేడుకలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు విశేష కృషికి గుర్తింపుగానే ఆయనను ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్కూల్ అధికారులు ఆహ్వానించారు. వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు అనంతరం విద్యార్థులతో జరిగే ముఖాముఖిలోనూ పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా డాట్ కామ్ సంస్థలు, బిజినెస్ స్కూల్స్ పుట్టుకొస్తున్న సమయంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఐటీ సంస్థలను, బిజినెస్ స్కూల్స్ ను, ఐఐటీలను హైదరాబాద్ కు తెచ్చిన వైనంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.