హుజూరాబాద్ పరాజయం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఓటమికి గల కారణాలు చెప్పాలంటూ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించుకుని సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశంలో నేతలు నానా రచ్చా చేశారు. ఓటమికి గల కారణాలను చిత్తశుద్ధితో అన్వేషించకుండా నెపం అవతలివారిపై నెట్టేందుకు, హైకమాండ్ దృష్టిలో మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నించారు.
పరస్పరం ధూషణభూషణలు పాల్పడుతూ నానా యాగీ చేశారు. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసుకున్నారు.
తప్పిపోయిన పెళ్లి సంబంధాలను గురించి విచారపడినట్టు.. ఈటెలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవద్దన్నది నువ్వంటే నువ్వు అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓటమి మూటగట్టుకున్నది చాలదన్నట్టు పార్టీ మిగిలున్న పరువును కూడా తీస్తూ.. దిగజారిపోతున్నారని మండిపడుతున్నారు.
అసలు హుజూరాబాద్ లో ఏం జరిగింది? పోటీ చేస్తానన్నా కొండా సురేఖకు రేవంత్ రెడ్డి టికెట్ ఎందుకు ఇవ్వలేదు?
ఈటలను కాంగ్రెస్ లోకి ఎందుకు చేర్చుకోలేదు.. చేర్చకుందామంటే మీరే వద్దన్నారు కాదా.. అని ఓ నేత మండిపడితే.. ఇకనైనా పద్దతి మార్చుకోవాలి లేకుంటే పార్టీ పరిస్థితి క్లోజ్ అవుతుందని మరోనేత హెచ్చరికలు.. లేదు లేదు కాంగ్రెస్ లో టీఆర్ఎస్ కోవర్డులున్నారు.. అందువల్లే ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్నామని అని ఇంకో నేత సంచలన ఆరోపణలు.
ఆరోపణలు, హెచ్చరికలు ఆగ్రహాల మధ్య కాంగ్రెస్ వార్ రూం సమావేశం వాడివేడిగా సాగినట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్‌లో ఘోర పరాజయం కాంగ్రెస్‌లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తోంది. హుజురాబాద్ ఓటమిపై ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.
ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం వాడివేడిగా సాగినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు మూడు వేల ఓట్లు రావడంపై నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఓటమికి మీదంటే, మీదే బాధ్యత అని పరస్పరం విమర్శలు సంధించుకున్నారు.
ఈ సమావేశం వార్ రూంలో వాడివేడిగా సాగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గంలో ఈ సారి 3 వేల ఓట్లు రావడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర నేతలు చిత్ర విచిత్రమైన వాదనలు వినిపించారు.
వాదనలు వినిపించడంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైలెట్ గా నిలిచారు. ఏ మాత్రం పసలేని వాదనలు వినిపించి అధిష్టానం ముందు అడ్గంగా బుక్కయ్యారు. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేదని భట్టి ప్రస్తావించారు. ఈటల కాంగ్రెస్‌లోకి రాకుండా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు.
భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈటల పార్టీలో చేరతానంటే మీరే వద్దన్నారు. ఇప్పుడు ఇతరులపై నిందలు ఎందుకు వేస్తున్నావు?’అని భట్టిపై వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉప ఎన్నిక ఫలితంపై కేసీ వేణుగోపాల్ ఒక్కొక్కరి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాను కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టానని, ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా సీనియర్ నేతలతో కమిటీని నియమించానని వివరించారు. కమిటీ ప్రతిపాదనల ప్రకారమే అన్ని నిర్ణయాలు తీసుకున్నామని, ముఖ్యనాయకులందరికీ ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించానని తెలిపారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన తమ్ముడైన కౌశిక్‌రెడ్డికి స్థానికంగా అధిక ప్రాధాన్యమిచ్చారని, చివరి నిమిషంలో ఆయన పార్టీ వీడారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంతలోనే ఉత్తమ్ కల్పించుకుని కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడానికి తనకు సంబంధం లేదని కొట్టిపారేశారు.
తనపై ఆరోపణలు చేయడం సరికాదని ఉత్తమ్ సూచించారు. హుజురాబాద్‌పైనే కాకుండా సాగర్, హుజూర్నగర్, దుబ్బాక ఓటమిపై సమీక్ష నిర్వహించాలని ప్రభాకర్ ప్రతిపాదించారు.
పార్టీలో కొందరు టీఆర్ఎస్కు సహకరిస్తున్నారని పొన్నం ఆరోపించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం కొద్దిసేపు కొండా సురేఖ వైపు తిరిగినట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో పోటీ చేసేందుకు కొండా సురేఖ సుముఖత వ్యక్తం చేసినా ఎందుకు నిలబెట్టలేదని వీహెచ్ ప్రశ్నించారు.
పోటీ చేడానికి సురేఖ కొన్ని వినతులు పెడితే వాటిపై స్పందించలేదంటూ ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీకి సురేఖ రాసిన లేఖను కేసీ వేణుగోపాల్‌కు వీహెచ్ అందించారు.
హుజురాబాద్ ఓటమిపై రాష్ట్ర నేతలకు వేణుగోపాల్ పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
‘పార్టీ నిర్వహించిన సభలకు సమావేశాలకు భారీగా ప్రజలు వచ్చినట్లు ఫొటోలు పంపించారు. మరీ ఓట్లు ఎందుకు వేయలేదు’అని వేణుగోపాల్ సూటిగా ప్రశ్నించారు.
హుజురాబాద్ ఎన్నికలు ప్రత్యేక పరిస్థితిలో జరిగాయని రేవంత్‌రెడ్డి జవాబిచ్చారు. ఈటల, కేసీఆర్ మధ్య ఎన్నికగా ఓటర్లలో ప్రచారం జరిగిందని, కేసీఆర్‌ను ఓడించాలన్న కసితోనే ఓటర్లు వ్యవహరించారని రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది.
సభలకు వస్తున్న జనానికి ఈ ఉప ఎన్నికకు సంబంధం లేదని, సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని రేవంత్ తెలిపారు. మొత్తానిక వార్ రూమ్ సమావేశం ఓ యుద్ధాన్ని తలపించేలా జరగిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.