ప్రజాస్వామ్య దేశంలో ప్రజలదే సార్వభౌమాధికారం. వాళ్లు ఓట్లు వేసిన నాయకులే గద్దెనెక్కుతారు. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మ లాంటి భారత్‌లో ప్రజలది ఎంతో ముఖ్యమైన పాత్ర. కానీ ఇప్పుడా ప్రజలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాజకీయ నాయకుల మాయలో పడి తనకున్న అధికారాన్ని హక్కులను కాలరాసుకుంటున్నారు. ఓట్లు వేసేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లెక్కడం చూస్తుంటే.. ఇక దేశంలో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజాసామ్య వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత వేడి పుట్టిస్తుందో తెలిసిందే. అటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇటు బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఈ ఎన్నికలో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం కేసీఆర్ శాయాశక్తుల ప్రయత్నిస్తున్నారు. పదునైన వ్యూహాలు రచించారు.
మరోవైపు ఈటల కూడా ఏ మాత్రం తగ్గకుండా కేసీఆర్‌కు దీటుగా నిలబడుతున్నారు. దీంతో ఈ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. బహిరంగంగా సాగిన ప్రచారం గడువు ముగియడంతో ఇక పోలింగ్‌కు ఒక్క రోజే సమయం ఉండడంతో వివిధ పార్టీల నాయకులు తెరచాటు వ్యవహారాలకు తెరతీశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. డబ్బులు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పంచుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటుకు రూ.6 వేలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఆ ధర మరింత పెరిగే అవకాశమూ ఉంది. ఇలా పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు నుంచి డబ్బులిచ్చి ఓట్లను కొనుక్కోవడం నాయకులకు అలవాటైంది. కానీ ఇప్పుడు హుజూరాబాద్‌లో పార్టీలు తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళన చెస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం శోచనీయంగా మారింది.
ప్రజలే స్వయంగా బయటకు వచ్చి తమకు డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కోండి అని ఇలా వ్యవహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో విజయం కోసం నాయకులు ఏ పనికైనా వెనకాడరు. వాళ్ల నైజం అదే. కానీ ప్రజలకు ఏమైంది? డబ్బులు ఇస్తేనే ఓట్లు పడతాయనేలా పరిస్థితిని మార్చేసింది జనాలే కదా. ఓటు మా హక్కని చెప్పి ఓట్లు వేసేందుకు డబ్బులు తీసుకోకుండా ఉండే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు కదా. నాయకులకు డబ్బు పంపిణీని అలవాటు చేసింది ప్రజలే కాదా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడేమో ఇలా రోడ్ల మీదకు వచ్చి ఓట్లు అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశాన్ని చాటడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.