ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై తీవ్ర ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు సీఎం కేసీఆర్ అన్ని అస్త్ర శస్త్రాలను ప్రయోగించి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను, మంత్రులను హుజురాబాద్ లో మోహరించి ప్రచారం చేయించినా ఫలితం దక్కలేదు. ఇక, కేవలం హుజురాబాద్ కోసమే క్రియేట్ చేసిన దళిత బంధు పథకం కూడా కేసీఆర్ అనుకున్న రిజల్ట్ ఇవ్వలేకపోయింది. సంక్షేమ పథకాలు, పథకాల రూపంలో నగదు ఇస్తే జనం ఓటేస్తారన్న భ్రమలను హుజురాబాద్ ఓటర్లు పటాపంచలు చేశారు.
దాదాపుగా బీజేపీ గెలుపు ఖాయమైన హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో ఇపుడో ఏపీలో కొత్త చర్చ మొదలైంది. జనాలను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాలు పెట్టడం, అప్పులు తెచ్చి మరీ వాటిని అమలు చేయడం వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ చేతులు కాల్చుకుంటున్న ఏపీ సీఎం జగన్ వ్యవహారంపై ఇపుడు జోరుగా చర్చ జరుగుతోంది. 10 లక్షలు ఇచ్చిన దళిత బంధు పథకం కేసీఆర్ కు పనికి రాలేదని, అటువంటిది కుటుంబానికి సరాసరిన10 వేల చొప్పున లబ్ధి కలిగించే పథకాలు జగన్ ను మరోసారి సీఎంని చేస్తాయా అన్న చర్చ మొదలైంది.
దళిత బంధు పెట్టడంపై చాలా విమర్శలు వచ్చాయి. అయినా సరే కేసీఆర్ వెనుకాడకుండా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలనుకున్నారు. కానీ, అది ఫెయిల్ కావడంతో కేసీఆర్ లో కొత్త భయం మొదలైందని టాక్ వస్తోంది. డబ్బులిచ్చినా, పథకాలు పెట్టినా ఓటర్లు తాము చేయాలనుకున్నదే చేస్తున్నారని కేసీఆర్ ఫిక్సయ్యారట. ఇక, పది లక్షలిస్తేనే కేసీఆర్ కు భంగపాటు తప్పలేదు…అటువంటిది 10 వేలు ఇచ్చి ఏపీ జనం తాను ఏం చెబితే అది చేస్తారన్న భ్రమలో ఉన్న జగన్ పరిస్థితి ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మన ప్రభుత్వంలో దాదాపుగా ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగేలా పథకాలు పెట్టాం కదా, కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అన్న ధీమాలో వైసీపీ నేతలు, జగన్ ఉన్న మాట వాస్తవం. కానీ, ఈ ఉప ఎన్నిక ఫలితంతో వైసీపీ నేతలు కూడా ఆలోచనలో పడే పరిస్థితి ఉంది. ఇండియన్ సైకాలజీ ప్రకారం ఉచితం అంటే జనం ఎగబడతారు.
సంక్షేమ పథకాలకు…లైట్ చుట్టూ ఉన్న మిణుగురు పురుగుల్లా ఆకర్షితులవుతారు. కానీ, ఒక్కసారి ఆ లైట్ ఆఫ్ కావడమో..టెంపరరీగా కరెంట్ పోవడమో జరిగితే…ఆ పార్టీని కూడా లైట్ తీసుకుంటారు. ఎవరెన్ని చెప్పినా…ఎంత డబ్బిచ్చినా…ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా…ఎంత లబ్ధి పొందినా…ఓటేసే సమయంలో జనం లెక్కలు వేరే ఉంటాయనడానికి హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితమే ఒక నిదర్శనం.
పథకాల సంగతి పక్కన బెడితే…జగన్ పాలనపై కూడా జనానికి వేరే లెక్కలున్నాయి. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్ , పెట్రోల్ రేట్లు, పన్నుల బాదుడు, ఆఖరికి చెత్తపై కూడా పన్ను వంటి అంశాలు మధ్యతరగతి జనాన్ని చికాకు పెడుతున్నాయి. ఇక, వైసీపీ నేతల అరాచకాలు, కక్షా రాజకీయాలు చూసి జనం చీదరించుకుంటున్నారు. ఇక, నడుము విరగ్గొట్టే తారు రోడ్లు..చెరువులు తటాకాలను తలపించే మట్టి రోడ్లు సామాన్యుడికి సైతం ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతున్నాయి.
ఇక, దేవుడి గుళ్లను కూలగొడుతున్నా జగన్ చోద్యం చూస్తున్న వైనం…ఆ దోషులను పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యం….వంటి పరిణామాలతో కోట్లాది మంది హిందువుల మనసులు గాయపడ్డాయి. రకరకాల కారణాలతో దగాపడి గాయపడిన ఆంధ్రా జనాల మనసులకు 10 వేలతో మలామ్ పట్టీ వేయాలనుకోవడం జగన్ అత్యాశే అవుతుందనేందుకు హుజురాబాద్ ఫలితమే ఓ ఉదాహరణ అనడంలో ఎటువంటి సందేహం లేదు.