నువ్వా నేనా అన్న రీతిలో సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఈ రోజు విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో హుజూరాబాద్ షా ఎవరన్నది తేలిపోనుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని రీతిలో సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టానికి భిన్నంగా హుజూరాబాద్ ఉప పోరు ఫలితం వెలువడుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ కత్తి కట్టిన తర్వాత ఆ నేత ఎంత బలవంతుడైనా సరే.. బలహీనమయ్యే రికార్డును ఈటల బ్రేక్ చేస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఉప పోరు పోలింగ్ ముగిసిన నాటి నుంచి విజేతగా ఈటల నిలుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ ఉప పోరు పోలింగ్ ట్రెండ్ ను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. మీడియా సంస్థల మాటల్ని చూస్తే.. విజయం ఎట్టి పరిస్థితుల్లో ఈటల సొంతమని చెబుతున్నారు.
ఉప పోరు ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. పోటాపోటీగా ఉంటుందని.. విజేత ఎవరైనా సరే 3వేలు లేదంటే 5 వేలకు మించిన మెజార్టీ రాదన్న మాట వినిపించింది. అయితే.. తమ అభ్యర్థికి పాతిక వేల బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తారని మంత్రి హరీశ్ రావు మాటలు అప్పట్లో వినిపించాయి.
ఉప పోరు ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ పైచేయి సాధిస్తుందన్న ప్రచారం భారీగా సాగింది. అయితే.. అనూహ్యంగా ఉప పోరు షెడ్యూల్ ప్రారంభించిన వారానికే వాతావరణంలో మార్పు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఈటల అధిక్యం కొంచెం కొంచెం పెరగటం.. అదే సమయంలో టీఆర్ఎస్ అధిక్యత తగ్గుతూ వచ్చింది.
ఒక దశలో హోరాహోరీ అన్నట్లుగా సాగిన ఈ ఉప పోరు.. పోలింగ్ నేపథ్యంలో మాత్రం క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. ఈటల విజయం సాధించటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తున్న ఈ ఉప పోరులో ఆయనకు 25 వేల మెజార్టీ వస్తుందన్న అంచనా వేస్తున్నారు.
పోలింగ్ పెద్ద ఎత్తున జరగటం దాదాపు 86 శాతానికి పైనే పోలింగ్ జరిగిన నేపథ్యంలో మెజార్టీ పాతిక వేలకు మించి ఉంటుందని చెబుతుంటే.. మరోవైపు.. డబ్బు పంపిణీ భారీగా సాగటం.. రెండు పార్టీలు ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతోనే పోలింగ్ పెద్దఎత్తున జరిగినట్లు చెబుతున్నారు.
ఇంత తీవ్రమైన పోటీ వేళ మెజార్టీ పాతిక వేలు రావటం కష్టమన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ పాతిక వేలు అంతకు మించిన మెజార్టీ ఈటల సొంతమైతే మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బగా ఉప పోరు నిలుస్తుందంటున్నారు. మరి.. హుజూరాబాద్ ప్రజల తీర్పు ఏమిటన్నది మరికాసేపట్లో తేలనుంది.