ఇలాంటోడ్ని ఏం చేయాలి? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఒక భర్త దుర్మార్గ చేష్ట ఇది. డబ్బు పేరాశతో భార్యను అందరి ముందు నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించిన పాపాత్ముడి ఉదంతంగా దీన్ని చెప్పాలి. వ్యాపారంలో లాభాల కోసం చేసిన ఈ పని గురించి తెలిసిన వారంతా చీ కొడుతున్నారు. ఇంతకీ ఈ దారుణం ఎక్కడ చోటు చేసుకున్నదంటే.. మహారాష్ట్రలోని పూనెలో. అసలేం జరిగిందంటే..
పూనెకు చెందిన వ్యాపారి ఇంట డబ్బుకు.. దర్పానికి లోటు లేదు. అయినా.. మరింత సంపద కోసం అతగాడి కక్కుర్తి అంతా ఇంతా కాదు. ఇలాంటి వేళ.. మరింత సంపద కోసం క్షుద్ర పూజ చేయాలని దారిన పోయే దానయ్య సలహా ఇస్తే.. దాన్ని పట్టుకొని అతగాడి వెంపర్లాట అంతా ఇంతా కాదు. ఒక మాంత్రికుడితో మరింత సంపద కోసం పూజలు చేయాలని కోరాడు.
దీనికి ఆ మాంత్రికుడు.. వ్యాపారి భార్యను నగ్నంగా నిలబెట్టి స్నానం చేసి.. పూజలు చేయించాలని చెప్పాడు. దీనికి వెనుకా ముందు ఆలోచించకుండానే సదరు వ్యాపారి ఓకే అనటంతో పాటు.. అతడి తల్లిదండ్రుల ఒత్తితో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వారు చెప్పినట్లే చేసింది. చుట్టూ ఉన్న వారు సైతం ఇదెక్కెడి పోయేకాలం అని ప్రశ్నించకుండా జరిగిన తంతును చూస్తూ ఉండిపోయారు. ఎవరూ అడ్డుకోలేదు.
ఈ ఉదంతం తర్వాత బాధితురాలి తల్లిదండ్రులకు విషయం తెలిసి వారు తీవ్ర ఆగ్రహానికి గురి కావటం.. బాధితురాలి తరఫున నిలవటంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ఇచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న పోలీసులు డబ్బు పేరాశతో దారుణానికి ఒడిగట్టిన వ్యాపారిని.. అతడి తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన మాంత్రికుడు పరారీ అయ్యాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.