ఎన్నికల వేళ వచ్చే ఒపినియన్ పోల్ కు విశ్వసనీయత.. ఫలితాలు వెలువడిన తర్వాత దగ్గరగా ఉన్నప్పుడు. అయితే.. అందరికి ఉండే ఆసక్తి మీద అంచనాలు చెప్పటం ద్వారా అందరిని మరింతలా ఆకర్షించేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తుంటాయి. మరికొన్ని సంస్థలు మాత్రం రోటీన్ గా ప్రయోగాల్ని చేస్తుంటాయి. తాజాగా ఆ కోవలోకే వస్తుంది ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే – సీ ఓటర్.
ఈ రెండు సంస్థలు కలిసి దేశంలో జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై పోల్ నిర్వహించింది. ఆసక్తికర వివరాల్ని వెల్లడించింది. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాల్లోని ఫలితాలు కాంగ్రెస్ కు సానుకూలంగ ఉంటాయని సర్వే రిపోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ విషయానికి వస్తే.. అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. ఫలితాన్ని మొత్తంగా చూసినప్పుడు మాత్రం తెలంగాణలో హంగ్ తథ్యమన్న విషయం స్పష్టమవుతుంది.
ఈ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన 60 సీట్ల మేజిక్ ఫిగర్ ను ఏ పార్టీ చేరుకోలేదని స్పష్టం చేసింది. విపక్ష కాంగ్రెస్ కు 54 సీట్లు మాత్రమే వస్తాయని.. బీఆర్ఎస్ కు 49 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. 49 సీట్ల సాధనలో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని మాత్రం సొంతంగా ఉండదు.
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చినప్పుడు గులాబీ పార్టీ ఏకంగా 39 స్థానాల్ని కోల్పోతుందని హెచ్చరించింది.
ఈసారి తెలంగాణలో అధికారం ఖాయమంటూ హడావుడి చేస్తున్న బీజేపీకి సింగిల్ డిజిట్ కే స్థానాల్ని గెలుస్తారని పేర్కొంది. బీజేపీకి కేవలం 8 స్థానాలకే పరిమితమవుతుందని.. మజ్లిస్ తో సహా ఇతరులకు 8 సీట్లు వస్తాయని.. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మూడు సీట్లు తగ్గుతాయని వెల్లడించింది.
ఒకవేళ.. అధికార బీఆర్ఎస్ కు మజ్లిస్ కు వచ్చిన సీట్లు కలిపినా కూడా మేజిక్ ఫిగర్ కు మూడు స్థానాల దూరంలో నిలిచిపోతుంది. మొత్తంగా సీట్ల సాధనలో అగ్రస్థానంలో నిలిచే కాంగ్రెస్.. మిత్రుడి బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు కూతవేటు దూరంలో నిలిచే గులాబీ పార్టీల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఎన్నికల పోలింగ్ కు దగ్గర దగ్గర 40 రోజుల టైం ఉండటంతో.. మరెన్ని పరిణామాలు పోలింగ్ వేళకు ప్రభావితం చేస్తాయో చూడాలి. నవంబరు 30న పోలింగ్ జరుగుతుంటే.. ఎన్నికల ఫలితాలు డిసెంబరు మూడున వెలువడనున్నాయి.