సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ పవర్‌ను మళ్లీ చూపించిన సినిమా ‘జైలర్’. గత నెలలో ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన ఈ చిత్రం దక్షిణాదిన భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ పండిట్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. కంటెంట్ పరంగా చూస్తే ఇది యావరేజ్ మూవీ. కానీ దాన్ని రజినీ చరిష్మా.. అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. స్వయంగా రజినీనే ‘జైలర్’ యావరేజ్ మూవీ అని.. అనిరుధ్ మ్యూజిక్ వల్లే దాని స్థాయి మారిందని సక్సెస్ మీట్లో ప్రకటించాడు.
నేపథ్య సంగీతానికి తోడు ‘హుకుం’ పాట జనాలను ఒక ఊపు ఊపేసి థియేటర్లలో గూస్ బంప్స్ ఇచ్చింది.
విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి హైప్ రావడానికి ‘హుకుం’ పాట ఒక కారణం అనడంలో సందేహం లేదు. సినిమాలో కూడా ఆ పాటను బిట్లు బిట్లుగా భలే వాడుకున్నాడు దర్శకుడు నెల్సన్. యూట్యూబ్‌లో ఏకంగా 80 మిలియన్ల వ్యూస్ రాబట్టుకున్న ఈ పాటను అసలు ముందు ప్లాన్ చేయనే లేదట అనిరుధ్, నెల్సన్. సినిమాలో పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఇలాంటి సాంగ్ పెట్టాలన్న ఆలోచనే లేదట.
ఐతే సినిమా రష్ చూసినపుడు రజినీ చెప్పిన ‘హుకుం’ డైలాగ్ విన్నాక దాని మీద ఒక పాట చేస్తే బాగుంటుందని అనిపించి.. లేటుగా ఈ పాటను కంపోజ్ చేసి సినిమాలో యాడ్ చేసినట్లు అనిరుధ్ వెల్లడించాడు. ఈ పాట సినిమాకు పెద్ద ప్లస్ అయిందని.. సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయి సినిమా రేంజిని పెంచిందని అనిరుధ్ అన్నాడు. దర్శకుడు నెల్సన్‌కు తన మీద అపారమైన నమ్మకమని.. అతను సంగీతం విషయంలో తనకు ఏ రకమైన సూచనలూ చేయడని.. ఏదైనా తనకే వదిలేస్తాడని అనిరుధ్ చెప్పాడు. తాను వందల కోట్ల బడ్జెట్ సినిమాకైనా.. చిన్న బడ్జెట్ సినిమాకైనా ఒకే రకమైన సంగీతం అందిస్తానని.. తేడాలేమీ ఉండవని అనిరుధ్ చెప్పాడు.