తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్‌కు కొన్నేళ్లుగా సరైన విజయం లేదు. తన చివరి చిత్రం ‘విడాముయర్చి’ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. అంతకుముందు తునివు, వలిమై లాంటి చిత్రాలూ నిరాశపరిచాయి. అయినా సరే.. అజిత్ కొత్త సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి హైప్ తక్కువేమీ లేదు. స్వయంగా అజిత్‌కు వీరాభిమాని అయిన ఆధిక్ రవిచంద్రన్.. తన లాంటి ఫ్యాన్స్ అజిత్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించినట్లే ఉన్నాడు ఈ చిత్రంలో.
ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్లో ఫ్యాన్ మూమెంట్స్‌కు ఢోకా లేదు. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. ‘మన్కాత’ సహా అజిత్ బ్లాక్ బస్టర్ సినిమాల రెఫరెన్సులతో సాగిన ట్రైలర్ అదిరిపోయింది. అజిత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అదరగొడతాడని పేరుంది. ‘వాలి’ నుంచి ‘మన్కాత’ వరకు ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకునే అజిత్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లున్నాడు ఆధిక్. తనకు చాలా దురలవాట్లు ఉన్నాయని.. కానీ వాటన్నింటినీ కుటుంబం కోసం వదిలేశానని.. కానీ తన కొడుకుకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అవన్నీ బయటికి తీయాల్సిందే కదా అంటూ అజిత్ చెప్పిన డైలాగ్ ట్రైలర్లో హైలైట్. ఒకవైపు యంగ్ అండ్ లీన్ లుక్‌లో పాత రోజులను గుర్తుకు తెస్తూనే.. ఇంకోవైపు మిడిలేజ్డ్, రఫ్ క్యారెక్టర్లోనూ అదరగొట్టాడు అజిత్. త్రిష.. సిమ్రన్.. అర్జున్ దాస్‌ల పాత్రలు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి.
తెలుగు నటుడు సునీల్ సైతం ఇందులో కీలక పాత్ర పోషించాడు. తన లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంది. యాక్షన్ దృశ్యాల్లో భారీతనం కనిపించగా.. ప్రతి సన్నివేశంలోనూ అజిత్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించడం ఖాయమనే సంకేతాలను ట్రైలర్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఈ నెల 10న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.