ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో చినబాబు లోకేశ్ నిన్న విజయనగరం వెళ్తూ వెళ్తూ నిన్నటి వేళ పొందూరు మీదుగా పర్యటన సాగించారు. అనంతరం రాజాం చేరుకుని కోళ్ల అప్పలనాయుడు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. తొలుత విజయవాడ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అటుపై రోడ్డు మార్గాన చిలకపాలెం కూడలికి వచ్చేసరికి పసుపు శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఆయన రాక సందర్భంగా పూలవానలు కురిపించాయి. ముందు కన్నా ఎక్కువ ఉత్సాహంతోనే ఆయన రాకను పండుగ మాదిరి జరిపాయి. ఇవన్నీ బాగున్నాయి.
కీలక నేతలతో ఆయన సమావేశం అయి నాలుగు మాటలు చెప్పారు. ఇవే ఇప్పుడు మరింత చర్చకు తావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎంతో పేరు, ప్రతిష్ట ఇచ్చిన శ్రీకాకుళం కేంద్రంగా మళ్లీ నిలదొక్కుకోవాలని యోచిస్తున్నారు లోకేశ్. వైసీపీకి కూడా ఉత్తరాంధ్రే సెంటిమెంట్ కావడంతో వాళ్ల హవాను అడ్డుకునేందుకు తమ చరిష్మాను కాపాడుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. తెగువ చూపి నెగ్గుకు రావాలన్న వ్యూహంతోనే ఉన్నారు. అదే నిన్నటి వేళ ఆయన వెన్నంటే ఉన్న తెలుగు యువత నాయకులకు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తిరిగి పాగా వేయాలంటే ఇప్పటి నుంచే శ్రమించక తప్పదు.
శ్రీకాకుళం, విజయనగరం రాజకీయాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాస్త రాజుల పాలన బాగా తెలిసిన విజయనగరంలో అశోక్ గజపతి రాజు హవా కొద్ది కాలంగా లేకుండా పోయింది. అయినా సరే ! ఆయన వెనక్కు తగ్గ లేదు. న్యాయపోరాటం చేసి మాన్సాస్ విషయమై కానీ సింహాచలం ట్రస్టు విషయమై కానీ రామతీర్థాల ఆలయంకు సంబంధించి రాజకీయంగా చోటుచేసుకున్న కొన్ని వికృత పరిణామాలను నిలువరించడంలో కానీ బాగానే విజయవంతం అయ్యారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని టీడీపీ భావిస్తోంది. మంత్రి బొత్సను ఢీ కొంటూనే ఇటు కీలక నేత అయిన ధర్మాన వ్యూహాలకూ చెక్ పె ట్టేందుకు లోకేశ్ పర్యటన ఏ మేరకు ప్రభావితం చేసి విజయ తీరాలకు చేరుస్తుందో అన్నదే ఇప్పుడిక కీలకం.