అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద నిర్ణయాలతో పలు దేశాల వారికి కంటగింపుగా మారిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవాలని కోరుకున్న వారిలో అత్యధికంగా భారతీయులు, చైనీయులే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్ని దేశాల వారినీ అక్కున చేర్చుకొని ఆదరించే అమెరికన్లలో లోకల్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన ట్రంప్….విదేశాల నుంచి ఉద్యోగం కోసం వచ్చేవారిని విపరీతంగా ద్వేషించారు.
ఈ క్రమంలోనే హెచ్1-బీ వీసాల విషయంలో ట్రంప్ వివాదాస్పద ఆదేశాలివ్వడంపై పెనుదుమారం రేగింది. భారత్, చైనా వంటి విదేశాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగావకాశాలు సన్నగిల్లేలా చేస్తూ అమెరికన్లకు మేలు జరిగేలా చేసే నిబంధనలను ట్రంప్ తెచ్చారు. హెచ్1-బీ వీసాపై అమెరికాకు వచ్చే విదేశీయుల జీతాలను భారీగా పెంచడం ద్వారా అమెరికా సంస్థలు విదేశీ నిపుణులను వద్దనుకుంటాయని ట్రంప్ ఎత్తు వేశారు.
అయితే, దిగ్గజ సంస్థలన్నీ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అదే సమయంలో ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ఆదేశాలను రద్దుచేస్తానని జో బైడెన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడు బైడెన్ ఆ వీసాల వ్యవహారంపై కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హెచ్-1బీ వీసాలపై బైడెన్ సర్కార్ కీలక ఉత్తర్వులను వెలువరించింది.
గత ప్రభుత్వ ఆదేశాలను దాదాపు 60 రోజుల వరకు పెండింగ్లో ఉంచుతూ బైడెన్ టీం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్1బీ వీసాదారుల జీతాల పెంపు అంశంపై ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలు మే 14 వరకు అమలులోకి రాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నోటిఫికేషన్ను జారీ చేసింది. మే 14 తర్వాత ఈ వ్యవహారంపై మరోసారి చర్చించనుంది. హెచ్1-బీ వీసాలు అత్యధికంగా పొందుతున్న దేశాలలో చైనా, భారత్ ముందు వరుసలో ఉన్నాయి. ట్రంప్ గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం మార్చి 31వరకు హెచ్-1బీ వీసాలపై నిషేధం అమలులో ఉంటుంది. తాజాగా బైడెన్ నిర్ణయంతో హెచ్-1బీ వీసాల వ్యవహారంలో పలువురికి ఊరట లభించింది.