టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం కొద్ది సంవత్సరాల క్రితం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో విచారణ కూడా ఎదుర్కొన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి వంటి పలువురు ప్రముఖులు సిట్ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు నటి రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు కూడా జారీ చేశారు.
వారి నుంచి గోర్లు, తల వెంట్రుకలు వంటి శాంపిల్స్ ను కూడా తెలంగాణ ఎక్సైజ్ అధికారులు సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఫోరెన్సిక్ నివేదిక, సాక్షాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వ్యవహారంలో దాఖలైన 8 కేసులలో 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. 6 కేసులలో సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేవని కొట్టివేసింది. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసు విచారణలో సంబంధిత అధికారులు సరైన విధివిధానాల పాటించలేదని నాంపల్లి కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఆ కొట్టివేసిన 6 కేసులు ఎవరిపై నమోదు అయినవి అన్న విషయం తెలియాల్సి ఉంది.