టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు, జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్ పై ఓ స్థల వివాదం నేపథ్యంలో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన దగ్గర జయభేరి సంస్థ కోసం మురళీ మోహన్ స్థలం తీసుకుని ఆ తర్వాత మోసం చేశారని ఓ భూమి యజమాని సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం మురళీమోహన్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులపైనా కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే మురళీ మోహన్ కు 41A సెక్షన్ కింద నోటీసులు జారీ అయ్యాయి. గురువారం నాడు విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ నోటీసులపై మురళీ మోహన్, ఆయన కుటుంబ సభ్యులు….ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. మురళీ మోహన్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
తన క్లయింట్ మురళీమోహన్, ఆయన కుటుంబ సభ్యుల తరఫున దమ్మాలపాటి శ్రీధర్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ పై ఉన్నది సివిల్ వివాదమని, దానిని క్రిమినల్ వివాదంగా మార్చారని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ భూమి యజమానితో జయభేరీ ప్రాపర్టీస్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘనకు గురికాలేదని కోర్టుకు విన్నవించారు. ఈ కేసుకు సంబంధించి ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు…ఈ కేసులో అన్ని రకాల తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, మురళీ మోహన్, ఆయన కుటుంబ సభ్యులకు ఊరట లభించినట్లయింది.