టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికి హై కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అనుమతి లేనిదే, అవసరం లేనిదే, కేసులు ఏమయినా లేకపోతే అటుగా అంటే ఆయన ఇంటి వైపు వెళ్లేందుకు వీల్లేదని తేల్చేసింది. దీంతో అయ్యన్న పాత్రుడికి పోలీసుల వేధింపుల నుంచి కాస్త మినహాయింపు దొరికనట్లైంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని హై కోర్టు చెప్పడంతో ఇప్పుడు టీడీపీ వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
ఇప్పటిదాకా వరుస మీద కేసులు బనాయించి ఇబ్బంది పెట్టిన పోలీసులు ఇకపై అయినా కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలని, రూల్ పొజిషన్ తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోవాలని అయ్యన్న వర్గం హితవు చెబుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో కోర్టులే లేకపోతే ఈపాటికి తనను చంపేసి ఉండేవారు అని విపక్షంను ఉద్దేశించి అయ్యన్న చెప్పిన లేదా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వస్తున్నాయి.
అసలు ముందస్తు అనుమతి లేనిదే ఎవరి ఇళ్లలోకి ప్రవేశించే హక్కే లేదని, కేసులు ఉంటే నోటీసుల వరకూ పరిమితం కావాలి కానీ గునపాలతో పొడిచి మరీ తలుపులు తెరవాల్సిన పనేం ఉందని నిన్నటి వేళ చాలా మంది టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. పౌరస్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా పోలీసుల ప్రవర్తన అన్నది తరుచూ ఉంటోందని వారంతా మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎలాంటి కేసులూ నమోదు చేయనప్పుడు మాజీ మంత్రి అయ్యన్న ఇంటికి వెళ్లొద్దని హైకోర్టు పదే పదే స్పష్టం చేస్తూ పోలీసులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. కేసులు ఏమయినా ఉంటే చట్ట ప్రకారమే నడుచుకోవాలని, రాజకీయ ఉద్దేశాలకు అనుగుణంగా నడుచుకోకూడదని కూడా పోలీసులకు హితవు చెప్పింది.
పోలీసులు తరుచూ తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడాన్ని సవాలు చేస్తూ అయ్యన్న హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయమూర్తి పై విధంగా కీలక వ్యాఖ్యలు చేసి, సంబంధిత ఖాకీ వర్గాలకు పలు స్పష్టమైన సూచనలు చేశారు. అదేవిధంగా నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ రాయకుండానే కేసులు నమోదు చేయడం వంటివి కూడా పోలీసులు చేస్తున్నారని అయ్య న్న చేసిన ఆరోపణలపై కూడా హైకోర్టు స్పందించింది. ప్రస్తుతానికి అయ్యన్నపై కొత్తగా ఏ కేసూ నమోదు కానందున ఆయన ఇంటి వైపు వెళ్లకూడదని స్పష్టం చేసింది.