అమరావతి ఇన్నర్ రింగురోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో తనకు 41ఏ నోటీసులు ఇవ్వడాన్ని లోకేష్ హైకోర్టులో సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే సీఐడీ విచారణను ఈ నెల 10వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. లోకేష్ విచారణకు తొందరేంటని లోకేష్ తరపు న్యాయవాది పోసాని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని లోకేష్ ను హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేయాలని, లోకేష్ తరఫు న్యాయవాదిని అనుమతించాలని, గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీ అధికారులను ఆదేశించింది.
ఇక, ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా ముందస్తు బెయిల్ కోరుతూ లోకేష్ పిటిషన్ వేశారు. కానీ, లోకేష్ ను ఆ కేసులో నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వెల్లడించారు. లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ ప్రకారం నోటీసులు ఇస్తామని కోర్టుకు చెప్పారు. దీంతో, ఈ రెండు కేసులలో లోకేష్ కు ఊరట లభించినట్లయింది.