జగన్ సర్కారుకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణను దేశపు అత్యున్నత ధర్మాసనం వాయిదా వేసింది. డిసెంబరు 8వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లను ఆదేశించింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాలలో చంద్రబాబు పాల్గొనవచ్చని, తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి మాట్లాడకూదని తెలిపింది. సీఐడీ, ప్రభుత్వం కూడా కేసు వివరాల గురించి బహిరంగంగా మాట్లాడకూడదని ఆదేశించింది.
చంద్రబాబుకు సంబంధించిన 17 ఏ సెక్షన్ తీర్పు తర్వాతే చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలని సీఐడీ అభ్యర్ధించగా..దానికి సుప్రీం కోర్టు అభ్యంతరం తెలిపింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసే సమయంలో తమ వాదనలు హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. హైకోర్టు తన పరిధి దాటి వ్యాఖ్యలు చేసిందని, తక్షణమే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది.