టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు తాజాగా భారీ ఊరటనిచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసుతోపాటు ఇసుక కేసులో చంద్రబాబుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణను ఈనెల 29కి, ఇసుక కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
వాస్తవానికి శుక్రవారం నాడు ఈ రెండు కేసులలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే, ఆయన మరో కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని ఏపీపీ చెప్పడంతో కోర్టు వాయిదాకు అంగీకరించింది. మరోవైపు, మద్యం టెండర్ల కేసులో కూడా చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు, సిఐడి తరఫు వాదనలు పూర్తయ్యాయి. దీంతో, ఈ మూడు కేసులలో త్వరలోనే చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.