రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత విభేదాలున్న నేపథ్యంలో వాటిని చక్కదిద్దే బాధ్యతలను సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు జగన్. అయితే, ఈ క్రమంలో పెద్దిరెడ్డికి అవమానాలు ఎదురవుతున్న వైనం చర్చనీయాంశమైంది. అనంతపురం రీజనల్ కో ఆర్డినేట్ హోదా జిల్లాలో పర్యటించి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్న పెద్దిరెడ్డికి సమ్మతి, అసమ్మతి వర్గాల నుంచి సెగ తగులుతోంది.
ఇక, తాజాగా పెద్దిరెడ్డికి పెనుకొండ నియోజకవర్గంలో ఘోర అవమానం జరిగింది. పెద్దిరెడ్డిపై సొంత పార్టీ నేతలు చెప్పులు విసరడం సంచలనం రేపుతోంది. పెనుకొండ వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పెద్దిరెడ్డిని వై జంక్షన్ వద్ద ఎమ్మెల్యే శంకర నారాయణ వ్యతిరేక వర్గీయులు అడ్డుకున్నారు. శంకర్ నారాయణకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం రోడ్డుపై బైఠాయించింది. ఈ క్రమంలోనే వాహనం దగ్గరకు వెళ్తున్న మంత్రి పెద్దిరెడ్డిపై కొందరు చెప్పులు విసిరారు.
అయితే, కాన్వాయ్‌ను అడ్డుకొని రోడ్డుపై కూర్చున్న కార్యకర్తలపై పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓ దశలో సహనం కోల్పోయిన పెద్దిరెడ్డి కార్యకర్తలను దూరంగా నెట్టేశారు. అంతకుముందు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పెద్దిరెడ్డికి చిక్కులు తెచ్చిపెట్టింది. ఇరు వర్గాల మధ్య ఉన్న వర్గపోరు భగ్గుమనడంతో పెద్దిరెడ్డికి అవమానం జరిగింది.
ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం పెద్దిరెడ్డి ఫ్లెక్సీలను మడకశిరలో ఏర్పాటు చేయగా. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. తిప్పేస్వామి వ్యతిరేకవర్గం ఈ పనికి పాల్పడిందని అంటున్నారు. ఇక, హిందూపురంలో కూడా పెద్ది రెడ్డి ఎదుటే ఇరు వర్గాలు మాటల యుద్ధానికి దిగాయి. దీంతో, ఇటువంటి చిల్లర పనులను పార్టీ సహించదని అక్కడే పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.