వినాయక చవితి వెళ్లిన తర్వాత వచ్చే దసరాకు పది రోజుల ముందు నుంచి పండుగ సీజన్ మొదలువుతుంది. వెంటవెంటనే వచ్చే పండగలతో వాతావరణం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. దసరా.. దీపావళి కాస్త గ్యాప్ ఇచ్చి క్రిసమస్.. న్యూఇయర్.. పొంగల్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా పండుగ సీజన్ సుదీర్ఘంగా సాగుతుంది. ఈ వేళలో.. షాపింగ్ భారీగా సాగటమే కాదు.. అన్ని వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి.
ఇదిలా ఉంటే.. దసరా.. దీపావళి పండుగల నెల రోజుల్లో గతానికి భిన్నంగా ఈసారి ఆన్ లైన్ అమ్మకాలు అదరగొట్టేసినట్లుగా చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ.61వేల కోట్లకు పైనే అమ్మకాలు సాగినట్లుగా చెబుతున్నారు. ఇంత భారీ బిజినెస్ గతంలో ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్ లో జరిగిన అమ్మకాలతో పోలిస్తే.. 65 శాతం పెరిగినట్లుగా రెడ్ సీర్ విడుదల చేసిన నివేదిక చెబుతోంది.
గత ఏడాది ఇదే సమయంలో రూ.37వేల కోట్ల బిజినెస్ జరిగిందని.. ఈసారి అందుకు భిన్నంగా భారీ బిజినెస్ జరిగినట్లు వెల్లడించారు. ఆన్ లైన్ లో జరిగిన భారీ అమ్మకాల్లో 66 శాతం ఫ్లిప్ కార్ట్ సొంతం చేసుకోగా.. తర్వాతి స్థానంలో అమెజాన్ నిలిచింది. గత ఏడాది బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ నమోదు చేసిన అమ్మకాలతో పోలిస్తే 40 శాతం వృద్ధిని సాధించినట్లుగా చెబుతున్నారు.
ఈ భారీ అమ్మకాల్లో దాదాపు 600 మంది అమ్మకందార్లకు ఈ సీజన్ లో రూ.కోటికి పైగా విలువైన అమ్మకాలు సాగించినట్లుగా చెబుతున్నారు. 6500 మంది అమ్మకందార్లు రూ.10లక్షలకు పైగా విలువైన అమ్మకాల్ని సాధించినట్లుగా చెబుతున్నారు. బీ..సీ.. శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్డర్లు అధికంగా లభించాయి. కరోనా వేళ.. బయటకు వెళ్లని వారికి.. ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున బ్రాండ్లు అందుబాటులో ఉండటం కూడా కలిసి వచ్చింది. వర్క్ ఫ్రం హోంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల కారణంగా కూడా ఆన్ లైన్ అమ్మకాలకు విపరీతమైన ఆదరణ కలిగేలా చేశాయంటున్నారు. దీనికి తోడు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఈ భారీ అమ్మకాలకు కారణంగా చెప్పక తప్పదు.