ప్రయివేటు బడులకు పరుగులు తీసే రోజులివి.. స్నేహితులు వద్దన్నా కూడా వేల ఫీజులు చెల్లించి మరీ ! సీట్లు కొనుగోలు చేసే రోజులివి. మంచి చదువు ఒక్క కార్పొరేట్ బడిలోనే వస్తుంది అన్న భ్రమ కూడా ఉన్న రోజు లివి.. కానీ మణికొండ స్కూలు అందుకు విభిన్నం.. మంచి వాతావరణంలో పిల్లలకు చదువు ఇస్తున్నది. మంచి ఫలితాలతో ముందుకు దూసుకుపోతున్నది.. వేలకు వేలు ఫీజులు చెల్లించి బడులకు పంపక్కర్లేదని చెబుతోంది.
ప్రయివేటు బడులకు కాంపిటేషన్ ఇస్తూ వస్తున్నది. ఇప్పుడు ఆ బడి బయట నో అడ్మిషన్ బోర్డు.. అప్పుడే సీట్లు అన్నీ ఫిల్ అయిపోయాయి. ఇంకా యాభై ఎడ్మిషన్ ఫారాలు పెండింగ్-లో ఉన్నాయి. ఆరు నుంచి పదో తరగతి వరకూ ఈ ఏడాది 371 మంది చేరారు. పాఠశాల స్ట్రెంత్ 1170 మంది. ఈ పాఠశాలకు మంచి క్రేజ్ ఉంది. ఉపాధ్యాయులు అంతా అంకిత భావంతో పనిచేస్తున్నారు.
అంతేకాదు వీలున్నంత వరకూ తల్లిదండ్రులతో చర్చిస్తూ మంచి విద్య అందించేందుకు అంతా కలిసి తపన పడుతున్నారు. ఆ తపన, తాపత్రయం నచ్చి పిల్లలకు ఈ బడి మరింత ఇష్టం అయిన ప్రాంగణంగా మారుతోంది. ఓ ప్రభుత్వ బడి సాధించిన విజయం ఇది. ఇక్కడికి దగ్గర్లో హై స్కూళ్లు ఉన్నా ఇంతటి ఆహ్లాదకర వాతావరణంలో పాఠాలు చెప్పేవారు అరుదు అని అంటున్నారు. ఇక్కడ ఈ ఏడాది పదో తరగతిలో 87శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఉపాధ్యాయులు సరిపోవడం లేదని, కొత్తగా మరికొందరిని ఇక్కడ నియమించాల్సి ఉందని ప్రధానోపాధ్యాయుడు అంటున్నారు. ఏదేమయినా ఏపీలో విద్యార్థుల హాజరులేక విలీనం పేరిట బడులు మూత పడుతుంటే ఇక్కడ మాత్రం ఇందుకు భిన్నం ఓ ప్రభుత్వ బడికి ఇంతటి స్థాయిలో ఎవ్వరూ ఊహించని విధంగా అడ్మిషన్లు జరగడం నిజంగానే శుభ పరిణామం.