టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 90వ రోజుకు దగ్గర పడుతోంది.
అయితే.. మొత్తం ఈ పాదయాత్రలో అనూహ్యమైన గుర్తింపు తెచ్చింది సెల్ఫీ విత్ లోకేష్ అనడంలో సందేహం లేదు.
మొదట్లో దీనిని కొందరు లైట్ తీసుకున్నారు.
సెల్పీలు తీసుకునేందుకు కాదు కదా.. పాదయాత్ర చేపట్టిందని..చాలా మంది నాయకులు అన్నారు.
అయితే.. సెల్పీల విషయంలో వచ్చిన విమర్శలను లోకేష్ పక్కన పెట్టారు.
అదే ఇప్పుడు యువగళం పాదయాత్రను హైలెట్ చేసిందని అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా.. మనిషికి ఉన్న సెంటిమెంటు ఏంటంటే.. ప్రముఖులతో తనకు గుర్తింపు కోరుకోవడం.
అదే ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్నారు.
లోకేష్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
దీంతో ఎక్కడెక్కడి నుంచో యువత పెద్ద ఎత్తున వచ్చి.. పాదయాత్రలో పాల్గొంటున్నారు.
ఇక, సెల్ఫీల కార్యక్రమంతోనే లోకేష్ కూడా పాదయాత్ర ప్రారంభిస్తున్నారు.
దీంతో ఇప్పుడు గ్రామ గ్రామాన లోకేష్ పేరు మార్మోగుతోంది.
నిజానికి ఒకప్పుడు.. నారా లోకేష్ కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితం అయ్యారు.
దీంతో ఆయన పేరు గ్రామాల్లో వినిపించేది కాదు. కానీ, ఇప్పుడు సెల్పీల కారణంగా.. ఆయన పేరు గ్రామాలకు బాగా చేరిందని తాజాగా వస్తున్న అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రామీణ స్థాయిలో చర్చ జరిగితే తప్ప.. రాజకీయంగా ఎదిగిన నాయకులు మనకు కనిపించరు.
వైఎస్ నుంచి చంద్రబాబు వరకు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టి ఎదిగారు.
సీఎం జగన్‌కూడా తన పాదయాత్రలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఉండేలా చూసుకున్నారు.
ఇప్పుడు నారా లోకేష్ దీనికి డిజిటల్ కూడా జోడించి చేసిన ప్రయోగం మంచి ఫలితాలు ఇస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఈ మార్పును గమనించిన నాయకులు.. ముఖ్యంగా సెల్ఫీలపై పెదవి విరిచిన నేతలు కూడా ఇప్పుడు లోకేష్ ను ప్రశంసిస్తున్నారు.
ప్రజల్లో దూసుకుపోతున్నారంటూ.. కితాబులు కురిపిస్తున్నారు.
వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున.. నారా లోకేష్ పుంజుకునేందుకు మరింత అవకాశం ఉందని.. చెబుతున్నారు.
మొత్తంగా పెదవి విరిచిన వారు.. ఇప్పుడు.. నారాలోకేష్ వ్యూహాలను ప్రశంసిస్తుండడం గమనార్హం.