టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే రాష్ట్రమంతటా పాదయాత్ర చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో యువగళం పేరిట పాదయాత్ర చేసేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారు. జనవరి 27 నుంచి 400 రోజులపాటు ఏకధాటిగా 4000 కిలోమీటర్ల మేర సాగేలా లోకేష్ పాదయాత్రను రూపొందిస్తున్నారు.
ప్రతి నియోజకవర్గంలో 3 లేదా 4 రోజులు సాగేలా, ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉండేలా, ఎక్కువ భాగం గ్రామాల్లో పాదయాత్ర కొనసాగేలా చూసుకుంటున్నారు. అయితే, కుప్పం నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ పాదయాత్రకు ఇంతవరకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. ఇదే విషయంపై ఏపీ డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ కూడా రాశారు. పాదయాత్రకు మరో వారం మాత్రమే గడువుందని, అనుమతులు ఇప్పిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు. అయితే, అనుమతులివ్వకుండా పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందే, దాడులకు పథకం సిద్ధం చేశావా జగన్ రెడ్డీ? అంటూ పైర్ అయ్యారు. పాదయాత్రపై దాడులు చేయాల్సిందిగా శాంతిపురం ఎంపీపీ, వైసీపీకి చెందిన కోదండరెడ్డి కుప్పం నియోజకవర్గ వాట్సాప్ గ్రూపుల్లో హింసాత్మక సందేశాలు పెడుతున్నాడని మండిపడ్డారు.
హింసను ప్రేరేపించేలా పబ్లిగ్గా మెసేజ్ లు పంపే స్థాయికి అతడు బరితెగించాడంటే కచ్చితంగా నీ హస్తం, మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్టే భావించాలా? అని నిలదీశారు. ఆ మెసేజ్ లు పంపిన వ్యక్తిపై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూస్తామని అచ్చెన్న అన్నారు.