టీడీపీ అధినేత చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపించిందా? తనను తాను ఇంకా తగ్గించుకుని మరింతగా ప్రజలకు చేరువయ్యారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఏ మాటకు ఆమాట చెప్పాల్సి వస్తే.. చంద్రబాబు అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. నిరసనలకు, ఉద్యమాలకు.. అంతే దూరంగా ఉంటారు. నిరసనల కారణంగా.. ప్రజా రవాణా.. వ్యవస్థలు నిలిచిపోయి.. అభివృద్ధి కుంటు పడుతుందనేది ఆయన ఉద్దేశం.
ఈ నేపథ్యంలోనే ఆయన పాలనా కాలంలోనూ ఎవరైనా నిరసనలకు పిలుపునిస్తే.. వెంటనే వారిని పిలిచి చర్చించడమో.. లేక.. సంప్రదింపుల ద్వారా శాంత పరచడమో చేసేవారు. అంటే.. దాదాపు నిరసనలకు కడు దూరంగా ఉండేవారు. అంతేకాదు.. నిరసనల ద్వారా సమయం వృథా చేసుకోవడమేనని.. చర్చల ద్వారా దేనినైనా సాధించుకోవచ్చని కూడా చెబుతారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తనను తాను మార్చుకుని.. నిరసనలకు దిగిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన తాజాగా అంగన్వాడీ, ఆశావర్కర్లు, వలంటీర్ల ఉద్యమాలకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం కుప్పం పర్యటనలో చంద్రబాబు.. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఆందోళన, నిరసనలు చేస్తున్నవారిక మద్దతు ప్రకటించడమే కాకుండా.. వారి వద్దకు స్వయంగా వెళ్లి.. విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. శాంతిపురం మండల సచివాలయం ఎదుట సమ్మెలో ఉన్న అంగన్వాడీలను చూసి చంద్రబాబు చలించి పోయారు.
వాహనం దిగి శిబిరం వద్దకు వెళ్లారు. వారి సమస్యలు విన్నారు. వినతిపత్రం తీసుకున్నారు. అధికారం లోకి రాగానే సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీడీపీ వచ్చాక వారి సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. శాంతిపురం బహిరంగ సభలో ఆశా వర్కర్లు… చంద్రబాబుకు అర్జీ ఇవ్వగా, వారి కోరికలను కూడా పరిష్కరిస్తానని హామీనిచ్చారు. మొత్తంగా చంద్రబాబు తన పంథాను మార్చుకుని.. మరీ ప్రజలకు మరింత చేరువయ్యారనే చర్చ సాగుతుండడం గమనార్హం.