ఎన్నికల ముంగిట జగన్ సర్కార్ కు గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వం లేదా అధికార పార్టీ తరఫున జనాల చేతుల్లో డబ్బులు పడితే దాని తాలూకు పాజిటివ్ ఎఫెక్ట్ చాలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నపుడు ఇలాంటివి పెద్దగా పని చేయవు అనడానికి 2019 ఎన్నికల ముంగిట పసుపు కుంకుమ పథకమే ఉదాహరణ. అయినా సరే.. జనాలను డబ్బుతో ప్రభావితం చేయాలనే చూస్తాయి పార్టీలు, ప్రభుత్వాలు.
ఈసారి ఎన్నికల ముంగిట కొన్ని నెలల పాటు లబ్ధిదారులకు అందాల్సిన ప్రభుత్వ పథకాల నిధులను జగన్ సర్కారు ఉద్దేశపూర్వకంగా ఆపి.. సరిగ్గా ఎన్నికల ముంగిట లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు వేద్దామని చూసింది జగన్ సర్కారు. కానీ ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి పెద్ద షాకే ఇచ్చింది.
ఇలా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రభుత్వ పథకాల డబ్బులు జనాల అకౌంట్లలో వేయడం ద్వారా అధికార పార్టీకి అదనపు ప్రయోజనం చేకూరుస్తుందన్న ఉద్దేశంతో ఎన్నికలు ముగిశాకే నిధులు చెల్లించాలని తేల్చేసింది. దీనిపై కోర్టుకు వెళ్తే.. శుక్రవారం ఒక్క రోజు నిధుల చెల్లింపుకి అవకాశమిచ్చింది న్యాయస్థానం. కానీ ప్రభుత్వం శుక్రవారం చకచకా డబ్బులు వేసే పని మీద శ్రద్ధ పెట్టలేదు, మరోవైపు ఈ వ్యవహారంపై మళ్లీ కేసులు, విచారణలు జరగడం వల్ల కూడా ఈ పని సక్రమంగా జరగలేదు.
కోర్టు జగన్ ప్రభుత్వానికి ఇంకో ఛాన్స్ ఇచ్చే సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శుక్రవారం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఉండాలి. అసలు మూణ్నాలుగు నెలల డబ్బులను ఎందుకు పెండింగ్లో పెట్టి సరిగ్గా ఎన్నికల ముందు చెల్లింపులకు సిద్ధమయ్యారు.. మధ్యలో వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణాలేవైనప్పటికీ లబ్దిదారులకు చెల్లింపులు జరగకపోవడం జగన్ సర్కారుకు ఎన్నికల ముంగిట ఎదురుదెబ్బే. చంద్రబాబు వల్లే డబ్బులు పడలేదని తప్పించుకోజూసినా జనాల్లో అసంతృప్తి చల్లారకపోవచ్చు.