వివేకా మర్డర్ మిస్టరీలో సీబీఐ విచారణ ముందుకు సాగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి రెండు సార్లు ఇచ్చిన వాంగ్మూలంతో వివేకా కేసులో అసలు దోషులెవరో తేలేదిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా వివేకా మర్డర్ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దస్తగిరి సంచలన విషయాలు వెల్లడించారు. దస్తగిరికి అవినాశ్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
”10…20…ఎన్ని ఎకరాలు కావాలి? ఎంత డబ్బు కావాలి! నేను ఇప్పిస్తా! మెజిస్ర్టేట్ ముందు ఏం చెప్పావో ఆ వివరాలన్నీ మాకు చెప్పు’’… అప్రూవర్‌గా మారిన దస్తగిరికి వివేకా మర్డర్ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ ఇచ్చిన ఆఫర్ ఇది. ఆఫర్ ఇచ్చింది భరత్ అయినా….ఆ ఆఫర్ వెనుక హస్తం మాత్రం అవినాశ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిలదని పుకార్లు వినిపిస్తున్నాయి. పలుమార్లు దస్తగిరిని కలిసిన భరత్.. వాంగ్మూలంలో చెప్పిన విషయాల గురించి గుచ్చిగుచ్చి అడిగినట్లు తెలుస్తోంది.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డితో మాట్లాడాలి, తోటవద్దకు రా… అని కూడా దస్తగిరిని భరత్ ఒకసారి పిలిచారని తెలుస్తోంది. భరత్ వ్యవహారంతో ఆందోళనకు గురైన దస్తగిరి….ఆ మొత్తం వివరాలతో గత ఏడాది సెప్టెంబరు 30న సీబీఐ ఎస్పీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో విషయాలు ఇప్పుడు బయటకు రావడంతో ఈ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ఆ లేఖతోపాటు సీఐ శంకరయ్య, వాచ్‌మ్యాన్ రంగన్న, హార్డ్‌వేర్ షాప్ యజమాని కృష్ణమాచారి ఇచ్చిన వాంగ్మూల ప్రతులు ఇప్పుడు బయటికి రావడంతో కేసు కీలక మలుపు తిరిగింది.