సీఎం జగన్ పాలనలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి వారంతా కొమ్ము కాస్తున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు దాడులు చేస్తే….దాడి చేసిన వారికి బదులుగా…టీడీపీ నేతలనే పోలీసులు అరెస్టు చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇక, ప్రభుత్వానికి వీర విధేయులుగా పోలీసులున్నారన్న విమర్శలు వస్తున్నా …వారి తీరు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే పీఆర్సీ వ్యవహారం నేపథ్యంలో తమ జీతంలో హెచ్ ఆర్ ఏ తగ్గదని పోలీసులు భావించారు. అయితే,అనూహ్యంగా వారందరికీ జగన్ సర్కార్ కుచ్చుటోపీ పెట్టింది.
ఖాకీలకే జగన్ కాకి లెక్కలు చెప్పారు. హెచ్ ఆర్ ఏ తగ్గింపు పోలీసులకు వర్తించదని చెప్పి…చివరకు దానిని తగ్గించారు. 23.29 శాతం ఫిట్మెంట్ లెక్క ప్రకారం అన్ని అలవెన్సులు కూడితే జీతం తగ్గలేదన్న భావన కల్పించినప్పటికీ….తాజాగా పోలీసులు అందుకున్న పే స్లిప్ లలో హెచ్ఆర్ఏ వ్యత్సాసం వేల రూపాయలు ఉండడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో, వారంతా తమ పోలీసు భాషలోనే యూనియన్ నేతలపైనా, ప్రభుత్వ పెద్దలపైనా కోపాన్ని వెళ్లగక్కుతున్నారని తెలుస్తోంది. ‘వీక్లీ ఆఫ్ అని సీఎం చెప్పినా….ఏ మాత్రం అమలు చేయని అధికారులు, సిబ్బంది కొరతతో పని భారం, సెలవుల సరెండర్ ఇవ్వక పోవడం, చివరికి హెచ్ఆర్ఏ కూడా తగ్గించడంపై ఖాకీలు మండిపడుతున్నారట.
పెళ్లాం పిల్లలను వదిలేసి…కరోనా కష్టకాలంలోనూ రాత్రింబవళ్లు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలిచినా తమకు దక్కిన ఫలితం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి చోట్ల సిటీ అలవెన్సులు రద్దు చేసి, హెచ్ఆర్ఏను 20 శాతం నుంచి 8శాతానికి తగ్గించడం ఏమిటని మండిపడుతున్నారట. చివరికు డీఏ కూడా 2 నుంచి 3 శాతం తగ్గించారని వాపోతున్నారట. అందరితోపాటు తమకూ కోతలున్నప్పుడు ఇన్నాళ్లూ తాము ప్రత్యేకని ప్రచారం చేయడం ఎందుకని లోలోపల మదనపడుతున్నారట. ఎన్జీవోలు, ఇతర ఉద్యోగుల్లా తాము రోడ్లపైకి వెళ్లి ఆందోళన చేసే అవకాశం కూడా లేదని, కానీ, వారి ఉద్యమంలో న్యాయం ఉందని అనుకుంటున్నారట.