నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. రాజద్రోహం సెక్షన్ (124-ఏ)ను జగన్ దుర్వినయోగపరిచి రఘురామపై కక్ష తీర్చుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రాజద్రోహం పేరుతో రఘురామను ఇరకాటంలో పెట్టాలనుకున్న జగన్….కస్టడీలో రఘురామను పోలీసులు కొట్టారన్న ఆరోపణలతో ఇరకాటంలో పడ్డారు. రఘురామ అరికాళ్లకు అయిన గాయాల ఫొటోలు వైరల్ కావడం…న్యాయస్థానాలు కూడా దీనిపై వివరణ కోరడంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సీఐడీ ఆఫీసులో ఆ రాత్రి ఏం జరిగిందన్న విషయాన్ని రఘురామ పూసగుచ్చినట్టు వెల్లడించారు. కేంద్ర సిబ్బంది-ప్రజాసమస్యలు, న్యాయశాఖలకు చెందిన పార్లమెంటరీ కమిటీ సభ్యులతో పంచుకున్న లేఖలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తనను అరెస్టుచేసిన రాత్రి గుంటూరులోని సీబీ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఉంచారని, అర్ధరాత్రి పూట ఐదుగురు వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి తనను కొట్టారని రఘురామ ఆరోపించారు. వారు తన కాళ్లు కట్టేసి అరి కాళ్లపై లాఠీలతో, రబ్బరు బెల్టులతో బాదడం ప్రారంభించారని ఆరోపించారు. అరవకుండా తన నోట్లో గుడ్డలు కుక్కారని, తన ఛాతీపై కూర్చున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు ఐదు రౌండ్ల పాటు తనను హత్యచేయాలన్నంత కసిగా దాడి చేశారని, అత్యంత హేయమైన బూతు పదజాలంతో హెచ్చరించారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేయడానికి నీకెంత ధైర్యమని ప్రశ్నిస్తూ హింసించారని ఆరోపించారు.
జగన్ సర్కార్ ను తాను విమర్శించడంతో తన పట్ల వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని రఘురామరాజు పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాసిన లేఖలో వివరించారు. జగన్కు బెయిల్ మంజూరు చేసి పదేళ్లయిందని, గత 18 నెలలుగా ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేదని తెలిపారు. ఇది బెయిల్ షరతులకు విరుద్ధం అని, కోర్టుకు హాజరు కాకుండా సీఎం మినహాయింపు కోరినప్పుడు సీబీఐ కూడా వ్యతిరేకించిందని తెలిపారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన సాక్షులను ప్రభావితం చేయడం ప్రారంభించారని ఆరోపించారు.
కస్టడీలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి.. తన శరీరంపై గాయాలే లేవంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ తయారు చేయించారని ఆరోపించారు. సీబీసీఐడీ అదనపు డీఐజీ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. సీఎం ప్రోద్బలంతో తప్పుడు ఆరోపణలతో సెక్షన్ 124-ఏ కింద తనను ఇరికించారని సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు విధించిన మార్గదర్శక సూత్రాలకు భిన్నంగా తనను జైలుకు పంపే ఉద్దేశంతో సెక్షన్ 124-ఏను ప్రయోగించారని ఆరోపించారు.
కాగా, రఘురామ లేఖలో తెలిపిన విషయాలు చదివిన కాంగ్రెస్ నేత మాణికం ఠాకూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైద్ధాంతికంగా తాను రఘురామతో విభేదిస్తానని, కానీ ఒక పార్లమెంటేరియన్ పట్లే ఈ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్లో సామాన్య రాజకీయ కార్యకర్తల మాటేమిటి? అదేమన్నా హిట్లర్ రాజ్యమా’ అని ఠాకూర్ ప్రశ్నించారు.