హనీట్రాప్..ఇపుడు తెలంగాణాలో కొత్తగా వినిపిస్తున్న పదం. హనీట్రాప్ అన్నది ఇప్పటివరకు మిలీట్రీ, నేవీ లాంటి సర్వీసెస్ లోనే ఎక్కువగా వినిపిస్తుండేది. అలాంటిది కొత్తగా క్వశ్చన్ పేపర్ లీకేజీలో కూడా కీలకమైందంటే ఆశ్చర్యంగా ఉంది. టీఎస్ప్ఎస్సీ నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇపుడీ కొత్తకోణం ఆసక్తిగా మారింది. టౌన్ ప్లానింగ్ అధికారుల క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయం బయటపడగానే అధికారులందరు ఆశ్చర్యపోయారు.
ముందు టీఎస్పీఎస్సీ సర్వర్లను హ్యాక్ చేయటం ద్వారా క్వశ్చన్ పేపర్ ను తెలుసుకున్నట్లుగా అనుమానించారు. అయితే పోలీసుల దర్యాప్తు మొదలుకాగానే సర్వర్లు ఎక్కడా హ్యాక్ కాలేదని నిపుణులు తేల్చారు. సర్వర్లలోని ప్రశ్నపత్రం భద్రంగానే ఉందని నిర్ధారణ చేసుకున్నారు. మరెట్లా పేపర్ లీకైంది ? అన్న విషయాన్ని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తుచేయటం మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలోనే ఒక అమ్మాయి తరచూ టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్ దగ్గరకు వస్తున్నట్లు గమనించారు.
వెంటనే ప్రవీణ్ ను పట్టుకుని విచారించినపుడు అసలు విషయం బయటపడింది. క్వశ్చన్ పేపర్ ను తానే లీక్ చేసినట్లు అంగీకరించాడట. ఎందుకంటే సదరు అమ్మాయికోసమే అని చెప్పాడట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే చెప్పలేకపోతున్నాడు. కొంతకాలంగా ఆ అమ్మాయి తన దగ్గరకు వస్తోందని మాత్రం అంగీకరించాడట. తనతో బాగా సన్నిహితంగా కూడా ఉందని చివరకు ఒప్పుకున్నాడు. అంటే ఎవరో ఆ అమ్మాయిని ప్రవీణ్ మీదకు ప్రయోగించినట్లు అర్ధమైపోతోంది.
ఆ అమ్మాయి ఎవరో పట్టుకుంటే కానీ అమ్మాయిని ప్రయోగించిన వ్యక్తి ఎవరో తెలీదు. అమ్మాయి మోహంలో పడి ప్రవీణ్ ఏకంగా ప్రశ్నపత్రాన్నే లీక్ చేసేశాడు. ఎప్పుడైతే హనీట్రాప్ వ్యవహారం వెలుగుచూసిందో అందరు ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు తెలంగాణాలో ఇలాంటి హనీట్రాప్ వ్యవహారం జరగలేదు. ఇపుడు మొదలైందంటే ముందు ముందు యావత్ ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా ఉండాల్సిందే. నేవీ, మిలిట్రీ లాంటి సర్వీసుల్లో అయితే ఇదే విషయంపై ఉన్నతాధికారులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. ఎంతోమందిని ఇప్పటికే అరెస్టు కూడా చేశారు. మొత్తానికి హనీట్రాప్ ఎంతటి పవర్ ఫుల్లో అర్ధమవుతోంది.