భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. చాలామంది కొత్తవాళ్లతో బరిలో దిగి ఆస్ట్రేలియాను ఆ దేశంలోనే ఓడించింది. అది కూడా 32 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాకు విజయాలే అందిస్తున్న గబ్బా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించి మ్యాచ్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది.
బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా-భారత్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఐదోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు దూకుడుగా ఆడి 328 పరుగుల భారీ టార్గెట్ చేధించింది.
2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది.
మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలవగా, రెండో టెస్ట్‌ను భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. మూడో టెస్ట్ డ్రా అయ్యింది. నాలుగో టెస్ట్‌ను భారత జట్టు మూడు వికెట్ల తేడాతో గెలిచింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిషభ్ పంత్ (89 పరుగులు) చివరి వరకూ క్రీజులో నిలిచి, ఫోర్‌తో జట్టుకు విజయం ఖరారు చేశాడు. అంతకు ముందువాషింగ్టన్ సుందర్ 22 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. చటేశ్వర్ పుజారా 56 పరుగులు చేసి ఔటయ్యాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ధాటిగా బ్యాటింగ్ చేసి 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.
కెప్టెన్ అజింక్యా రహానే సైతం వేగంగా పరుగులు చేశాడు. 22 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 9 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ నాలుగు వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియాకు కంచుకోటగబ్బా
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కోట లాంటిది. ఇక్కడ ఆ జట్టు ఆడిన గత 55 టెస్ట్ మ్యాచ్‌ల్లో 33 గెలిచింది. 13 డ్రా కాగా, ఒక మ్యాచ్ టై అయ్యింది. 8 టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి చవిచూసింది.
పైగా, 1988 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఆ జట్టు ఈ మైదానంలో ఓడిపోలేదు.
అలాంటి కంచుకోటలోనే భారత్ ఆ జట్టు ఓడించింది.