జగన్ పాలనలో హిందూ దేవాలయాలే టార్గెట్ అవుతున్నాయా? వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగాయా? ఏపీ సీఎం జగన్ పాలనలో ఏం జరుగుతోంది? దేవాలయాలు, విగ్రహాలపై వరుస దాడుల ఘటనలు దేనికి సంకేతం?
వైసీపీ 18 నెలల పాలనలో ఆ ఆరోపణలకు ఊతమిచ్చే ఘటనలు ఎన్నో జరగడంతో ఏపీ సర్కార్ వైఖరి సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయనగరంలో ప్రఖ్యాతిగాంచిన రామతీర్థ ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తల నరికివేసిన ఘటన పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటన మరువకు ముందే తాజాగా, మరో ఆలయంలో ఘోరం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విఘ్నేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఉపాలయంలో ఉన్న విగ్రహం రెండు చేతులను దుండగులు తొలగించిన ఘటన కలకలం రేపింది. దీంతో, వందలాది మంది భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
ఏపీలో గత 18 నెలలుగా హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్న పరిణామాలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి చారిత్రక రథం దగ్ధం ఘటన, విజయవాడ కనకదుర్గ ఆలయంలో సింహాల ప్రతిమల దొంగతనం, తిరుపతిలో సీఎం జగన్ డిక్లరేషన్ వ్యవహారం, కాకినాడలో దేవీ విగ్రహాలు ధ్వంసం, నెల్లూరులో రథం ధ్వంసం, ఆర్చీలు బద్దలు కొట్టడం, ఆంజనేయుడి స్వామి విగ్రహం చేతులు విరగ్గొట్టడం,విజయనగరంలోని రామతీర్థ ఆలయంలో రామచంద్రస్వామి విగ్రహం తల నరికివేత…వంటి వందలాదిఘటనలు ఏపీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. జగన్ కు హిందూ సంప్రదాయాలపై గౌరవం, నమ్మకం లేవని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు ఈ ఘటనలు ఊతమిచ్చేలా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
గతంలో అరకొర ఘటనలు జరిగినప్పటికీ ….ఈ స్థాయిలో వరుసగా హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలకు పాలకుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. సీమాంధ్రలో మునుపెన్నడూ లేని మతపరమైన వివాదాలు గత ఏడాదిన్నర కాలంలో పెచ్చుమీరిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యతన్న ఆరోపణలు వస్తున్నాయి. ముస్లిం, క్రైస్తవ సోదరులతో కలిసిమెలిసి ఉంటున్న హిందూ సోదరుల సహనాన్ని ఈ తరహా ఘటనలు పరీక్షిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆలయాలు, విగ్రహాల ధ్వంసం విషయంలో అరెస్టు చేసిన వారిపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయా, దోషులను శిక్షించకుండా ఉపేక్షించడం వల్ల హిందూ సమాజానికి నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా హిందూ ఆలయాలు, ఆస్తులపై దాడుల వ్యవహారంలో ప్రభుత్వ తీరు పలు అనుమానాలకు తావిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.