ఉన్నది ఉన్నట్లు చెప్పిన హిమాన్షు అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. అయితే ఆ చెప్పటం వల్లే తాత కేసీయార్ తండ్రి కేటీయార్ పరువు కూడా తీసేశారు. కేటీయార్ కొడుకు, కేసీయార్ మనవడు అయిన హిమాన్షు శేరిలింగంపల్లిలోని కేశవనగర్ స్కూలుకు వచ్చారు. స్కూలులో బాత్ రూములు, మెట్లు తదితర నిర్మాణాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి (సీఎస్ఆర్) కింద హిమాన్షు సహచర విద్యార్ధుల నుండి రు. 40 లక్షలు విరాళాలు సేకరించి స్కూలు అభివృద్ధికి ఖర్చుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతు కార్పొరేట్ స్కూలులో చదువుకున్న తాను ప్రభుత్వం స్కూలును మొదటిసారి చూసినట్లు చెప్పారు. అప్పుడు ప్రభుత్వ స్కూలు ఇంత అధ్వాన్నంగా ఉండటం చూసి తన కళ్ళల్లో నీళ్ళొచ్చేసినట్లు చెప్పారు. అమ్మాయిల బాత్ రూముల ముందే పందులు తిరుగుతున్నాయని, ఒక పిలగాడు మెట్లమీద నడస్తు పడిపోయాడని, మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదన్నాడు. అందుకనే ఈ స్కూలును దత్తత తీసుకోవాలని అప్పుడే అనుకున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ స్కూలు ఇంత అన్యాయంగా ఉందంటే తాను నమ్మకలేకపోయినట్లు హిమాన్షు చెప్పాడు. దీంతో ఇపుడు అందరి దృష్టి కేసీయార్, కేటీయార్ మీదకు మళ్ళింది. ఇవే మాటలను కాంగ్రెస్, బీజేపీ నేతల్లో ఎవరైనా చెప్పుంటే బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడులు మొదలుపెట్టేసుండేవారు. అయితే చెప్పింది స్వయంగా కేసీయార్ మనవడే కావటంతో ఏమీ మాట్లాడలేక నోళ్ళు కట్టేసుకున్నారు. మన ఊరు-మన బడి పేరుతో తమ ప్రభుత్వం వేలాది స్కూళ్ళను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం ఒకటే ఊదరగొడుతున్న విషయం అందరికీ తెలిసిందే.
మరది నిజమే అయితే ఇప్పటివరకు ఈ పథకంలో ఎన్ని స్కూళ్ళను అభివృద్ధి చేయించిందనే విషయాన్ని లెక్కలతో సహా చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని స్కూలే ఇంత అధ్వాన్నంగా ఉంటే ఇక జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఏదేమైనా హిమాన్షు చేసిన వ్యాఖ్యల కారణంగా కేసీయార్, కేటీయార్ పై ప్రతిపక్షాల నేతలు దుమ్ముదులిపేస్తున్నారు. దాంతో ఎదురు మాట్లాడటానికి ఏమీలేక కారు నేతలు మౌనంగా ఉండిపోయారు.