ఉల్టా చోర్ కొత్వాల్ కో డాటే…తనను పట్టుకున్నపోలీసుపైనే దొంగ దొంగతనం మోపడం అన్న అర్థంలో ఈ సామెత వాడతారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పాలన ఈ విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు వెళ్లి వస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ కారుపై దాడి చేయడమే కాకుండా….తిరిగి ఉమపైనే అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడం ఒక్క జగన్ కే చెల్లిందని విమర్శలు వస్తున్నాయి.
ఉమను అర్ధరాత్రి బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దేవినేని ఉమతో పాటు పట్టాభి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరెస్ట్ కావడంతో కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఉమను తమకు చూపించాలని పోలీసులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అక్రమ కేసు పెట్టడమే కాకుండా…ఉమను అరెస్టు చేయడంతో స్టేషన్ దగ్గర హై టెన్షన్ ఏర్పడింది.
అంతకుముందు దేవినేని ఉమను పెదపారుపూడి పోలీస్ స్టేషన్ నుంచి నందివాడ పీఎస్కు తరలించారు. దీంతో, నందివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీడియాను కూడా అనుమతించని పోలీసులు…స్థానికులను కూడా ఆధార్ కార్డు ఉంటేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. నందివాడకు వస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు నందివాడ పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఉమపై 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149…ఇలా మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.