తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ లో వైసీపీ నేతలకు కొన్ని చోట్ల షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా దర్శి మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోగా…కృష్ణా జగ్గయ్యపేటలో హై టెన్షన్ నెలకొంది. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశ్యంతో ఉన్న వైసీపీ నేతలు..టీడీపీ అభ్యర్థుల గెలుపును అంగీకరించడం లేదు. టీడీపీకి 8 వార్డులు అనుకూలంగా రావడంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.
4 వార్డులో టీడీపీ అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి 14 ఓట్ల తేడాతో గెలుపొందారని ప్రకటించారు. దీంతో, ఇద్దరు అభ్యర్థులు దీనికి అంగీకరించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అయితే, అనూహ్యంగా రెండు గంటల తర్వాత కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన వైసీపీ అభ్యర్థి…రీకౌంటింగ్ కు పట్టుబట్టారు. వైసీపీ నేతలు బలవంతంగా రెండు సార్లు రీకౌంటింగ్ చేయించారు. అయినా సరే టీడీపీ అభ్యర్థే గెలవడంతో అక్కడ అలజడులు రేపేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక, 13 వ వార్డులో టీడీపీ అభ్యర్థి, తన సమీప వైసీపీ అభ్యర్థిపై 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, రీకౌంటింగ్ చేపట్టాలంటూ వైసీపీ అభ్యర్థి పట్టుబట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఉదయ భాను దగ్గరుండి రీ కౌంటింగ్ చేయించారు. రీ కౌంటింగ్ లోనూ తెలుగు దేశం అభ్యర్థికి అదే మెజారిటీ వచ్చింది. దీంతో, మరోసారి కౌంటింగ్ చేయాలని అధికారులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
దీంతో, ఎమ్మెల్యే ఉదయభాను కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడం వివాదం రేపింది. ఎమ్మెల్యే రావడంపై కలెక్టర్, ఎస్పీలకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఏజెంట్లను బెదిరించారని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వైసీపీ పట్టణ అధ్యక్షుడు జగదీష్, ఆయన అనుచరులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. 4, 13 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు నోటీసు బోర్డులో కూడా అధికారులు ప్రకటించారు. రీకౌంటింగ్ కోసం వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తుండటంతో నోటీసు బోర్డును తొలగించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు, కుప్పంలో 11వ వార్డులో కేవలం 06 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కస్తూరి విజయం సాధించారు. దీంతో, రీ కౌంటింగ్ జరపాల్సిందేనని.. ఈ సారీ తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారని వైసీపీ పట్టుబట్టింది. అధికార పార్టీ డిమాండ్ ప్రకారం రీ కౌంటింగ్ జరిపించినా కస్తూరి గెలవడంతో వైసీపీ భంగపడింది. పట్టుబట్టి మరీ వైసీపీ రెండోసారి రీ కౌంటింగ్ చేయించుకొని పరువు తీసుకుందని స్థానికులు అంటున్నారు.