ఈ వేసవికాలం ఏప్రిల్ నెలలోనే ఉడుకుతున్న ఎండలు 40 డిగ్రీలు దాటాయి. కొన్ని చోట్ల ఊష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీలు దాటిపోవడంతో దేవవ్యాప్తంగా వాతావరణ శాఖా వివిధ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్పితే మరో నాలుగైదు రోజుల ప్రజలకు రోడ్ల మీదకు రావద్దని, ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరికలు జారీచేస్తున్నారు.
అయితే సాధారణంగా వేసవి అంటే పిల్లలకు సెలవులు కూడా ఉంటాయి కాబట్టి అందరూ నాలుగు రోజులు చల్లగా గడుపుదామని హిల్ స్టేషన్ల వైపు పరుగులు పెడతారు. కానీ ఈ వేసవిలో ఊటీ కూడా అధిక ఊష్ణోగ్రతలతో ఉడికిపోతుందట. సాధారణం కన్నా ఎక్కువ ఊష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయట.
హిల్ స్టేషన్ అయిన ఊటీలో ఏప్రిల్ 29న 29 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదు అయిందట, ఇది సాధారణం కంటే 5.4 డిగ్రీలు ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మే 1 న కూడా దాదాపు అంతే ఊష్ణోగ్రత నమోదయింది. 1986 ఏప్రిల్ 29న 28.5 డిగ్రీలు నమోదైందని, 38 ఏండ్ల తర్వాత ఆ రికార్డు చెరిగిపోయిందని చెబుతున్నారు.
ఇక శనివారం 33 డిగ్రీలు, ఆదివారం 34 డిగ్రీల వరకు అక్కడ ఊష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత మెల్లిగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రాత్రివేళ మాత్రం ఊష్ణోగ్రతలు తక్కువగా ఉండడం పర్యాటకులకు ఊరటనిచ్చే అంశం.