ఏపీలో మంత్రులకు ఒకటే పని.
అవకాశం దొరికినపుడల్లా చంద్రబాబును, లోకేష్ ను తిట్టడం.
మరి మంత్రుల అసలు పని ఎవరు చేస్తారు? ఇంకెవరు… సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆయన కాకుండా కాస్త మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేది ఇద్దరో ముగ్గురో ఉంటారంతే.
ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హద్దులు దాటడం, వ్యక్తిగత అమానవీయ దూషణలకు పాల్పడటం, రాజకీయ గందరగోళం, అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతినిధుల మధ్య వాగ్వాదానికి దారితీయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు హద్దుల దాటిన ఎమ్మెల్యేలు, మంత్రులకు బెదిరింపు సందేశాలు పెరిగాయి.
కొందరికి బెదిరింపు ఫోన్లు కూడా వచ్చాయట. వీటిని దృష్టిలో ఉంచుకుని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు ద్వారకపూడి చంద్రశేఖర్, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులకు భద్రత పెంచారు. వారికి భద్రత పెంచుతూ డిజిపి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
పని మానేసి పనికిమాలిన మాటలు
వైసీపీ మంత్రులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ రోజూ శాఖకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టని ఏపీ మంత్రులు కేవలం చంద్రబాబును తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెడుతున్న విషయం అందరికీ అర్థమైంది.
జగన్ కావాలనే వారిని రెచ్చగొడుతున్నట్టు కూడా అందరికీ అర్థమవుతోంది. అభ్యంతకరమైన భాష వాడటం, కనీస మర్యాద పాటించకపోవడంతో వీరి పట్ల ప్రజల్లో ఏహ్య భావం కలుగుతోంది. ఇప్పటికే ఇలాంటి భాష వాడిన సాయిరెడ్డిని వైజాగ్ ప్రజలు చీదరించుకుంటున్న విషయం తెలిసిందే.
ఇపుడు అలాంటి అభిప్రాయమే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలపై పడుతోంది. రాయలసీమలో వచ్చిన వరదలతో ప్రభుత్వం పరువు గంగలో కలిసింది. వరదల్లో ప్రజలను పట్టించుకోని వైసీపీ నేతలు తెలుగుదేశాన్ని తిడుతూ కూర్చోవడం జనానికి ఏమీ నచ్చలేదు.
వైసీపీ నమ్మొచ్చా?
ప్రతిపక్షం నుంచి హెచ్చరికలు వస్తే వాటికి కౌంటర్ వేయడమే వైసీపీకి తెలుసు. కానీ భయపడినట్లు ఉండరు. అలాంటిది… తాము భయపడ్డ సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇదేదో స్ట్రాటజీ అని అర్థమవుతోంది.
ఈ వ్యవహారంలో చంద్రబాబుకు సింపతీ పెరుగుతోందన్న విషయం గుర్తించి ఇలా చేస్తున్నారన్న అనుమానాలున్నాయి.