విశాఖలోని రుషికొండ హరిత రిసార్ట్స్ వద్ద పర్యాటక ప్రాజెక్ట్ పేరుతో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు వచ్చాయి. రుషికొండలో పాత భవనాలు కూల్చిన చోటే కొత్త భవనాలు కట్టాలని, అవి కాకుండా కొత్తి రిసార్ట్ విస్తరణ అంటూ ఏ భవనాలు కట్టవద్దని సుప్రీం కోర్టు కూడా ఆదేశించింది. రిషికొండ తవ్వకాలపై హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వానికి గతంలో సుప్రీం సూచించింది.
హైకోర్టులో తేలేంతవరకు ఇకపై కొత్త తవ్వకాలు చేపట్టకూడదని, పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలన బేఖాతరు చేసి మరీ కొత్త రిసార్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో, ఆ పనులను పరిశీలించేందుకు కొద్ది నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు, ఆ తర్వాత జనసేన నేతలు ఆ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లగా వారిని అడ్డుకున్నారు.
అంతేకాదు, కొత్త రిసార్ట్ కట్టాలనుకుంటున్న స్థలంలో ఏం జరుగుతోందో పరిశీలించేందుకు అటవీ, గనుల శాఖల అధికారులు ఒకటి, రెండుసార్లు వెళ్లగా…వారికీ అటువైపు వెళ్లొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో, ఇటు ప్రతిపక్ష నేతలు, సంబంధిత శాఖల అధికారులు ఎవ్వరికీ అక్కడ ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి మరీ రుషికొండపై తవ్వకాలు జరిపారని నిర్ధారణ అయితే బాధ్యులైన అధికారులకు 6 నెలల జైలుశిక్ష విధిస్తామని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. కూల్చివేతలు జరిపిన 5.18 ఎకరాల్లోనే నిర్మాణాలు జరుపుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ (ఎంవోఈఎఫ్) అనుమతులు ఉల్లంఘించి తవ్వకాలు జరిపినా, నిర్మాణాలు చేపట్టినా కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది.
ఎంవోఈఎఫ్ ఇచ్చిన అనుమతులు ఉల్లంఘించి తవ్వకాలు జరిగాయో, లేదో తేల్చడంతో పాటు ఎంతమేర నిర్మాణాలు జరిపారో నిర్ధారించేందుకు సంబంధిత జిల్లా జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపింది. అయితే పిటిషనర్లు దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్లపై రిప్లై అఫిడవిట్ వేసేందుకు సమయం ఇవ్వాలని ఏపీ టూరిజం కార్పొరేషన్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అభ్యర్థించారు. దీంతో, ఆ అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం ఈ వ్యవహారంలో విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.
అంతకుముందు, కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌కి విరుద్ధంగా విశాఖ జిల్లా, చినగదిలి మండలం, ఎండాడ గ్రామం పరిధిలోని సర్వే నం.19లో రుషికొండను తవ్వేయడంతో పాటు చెట్లను తొలగిస్తున్నారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ వాసి, జనసేన నాయకుడు పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యలు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు…తవ్వకాల ద్వారా వచ్చిన వ్యర్థాలను సముద్రంలో పడేసేందుకు కలెక్టర్ అనుమతివ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అనుమతులకు మించి రిషికొండపై దాదాపు 20 ఎకరాలను తవ్వేశారని, వచ్చిన వ్యర్థాలను వినియోగంలో లేని పార్కుతోపాటు చింతలుప్పాడ సముద్ర తీరాన పోస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో, తమ ఆదేశాలు ఉల్లంఘించిన అధికారుల జైలుకి వెళ్లక తప్పదని తాజాగా ఆ పిటిషన్లపై మరోసారి విచారణ జరిపిన హైకోర్టు వ్యాఖ్యానించింది.