ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లోనే ఉండేలా చూడాలని, మీడియాతో మాట్లాడకుండా చూడాలని డీజీపీ సవాంగ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, నిమ్మగడ్డ ఆదేశాలను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టులో అంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిపిన హైకోర్టు పెద్దిరెడ్డికి షాకిచ్చింది. ఎస్ఈసీ ఉత్తర్వులను సమర్ధించిన హైకోర్టు… మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడేందుకు వీల్లేదని తీర్పునిచ్చింది.
ఎన్నికల అంశాలకు సంబంధించిన ఏ విషయాలపై మీడియా ముందు పెద్దిరెడ్డి మాట్లాడకూడదని హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు, పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌పై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని హైకోర్టు వెల్లడించింది. మంత్రి పెద్దిరెడ్డి ఇల్లు కదలకుండా చూడాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, తన సొంత జిల్లా చిత్తూరులోని తిరుపతిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనకు మంత్రి హోదాలో పెద్దిరెడ్డి హాజరయ్యారు.
పెద్దిరెడ్డి పిటిషన్ పై హైకోర్టులో ఈ ఉదయం నుంచి వాడీవేడీ వాదనలు జరిగాయి. ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని మాత్రమే సమర్థించిన హైకోర్టు…మరికొన్నిటిని తోసిపుచ్చింది. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, తన వివరణ తీసుకోకుండానే పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు, బ్లాక్ లిస్టులో పెడామంటూ అధికారులను పెద్దిరెడ్డి బెదిరించిన వ్యాఖ్యల క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు మిశ్రమంగా తీర్పునిచ్చింది.