విశాఖలో జగన్ అండ్ కో వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలు, భూములు అప్పణంగా దోచుకునేందుకే దానిని పరిపాలనా రాజధానిగా ప్రకటించారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే, ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా ఉన్న విజయసాయి…విశాఖలో భూ ధందాకు తెరతీశారని టీడీపీ నేతలు పలుమార్లు దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే విశాఖలోని రుషికొండ హరిత రిసార్ట్స్ వద్ద పర్యాటక ప్రాజెక్ట్ పేరుతో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు వచ్చాయి.
ఇక, రిషికొండ పరిధిలో ఉన్న పాత రిసార్ట్‌ను పూర్తిగా కూల్చేసి..దానిని విస్తరిస్తూ కొత్త రిసార్ట్‌ను కడుతుండడంపై ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో కొత్త రిసార్ట్‌కు సంబంధించి జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. రిషికొండ రిసార్ట్ విస్తరణకు అనుమతి లేదని, రిషికొండ తవ్వకాలపై హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. హైకోర్టులో తేలేంతవరకు ఇకపై కొత్త తవ్వకాలు చేపట్టకూడదని, పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో, సుప్రీంకోర్టులో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ కు ఆ వ్యవహారంలో హైకోర్టులోనూ చుక్కెదురైంది.రుషికొండలో అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు సాగుతున్నాయని దాఖలైన 2 పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేసేందుకు హైకోర్టు అంగీకరించింది. అంతేకాదు ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని జగన్ సర్కార్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కాగా, కొద్ది రోజుల క్రితం రుషికొండ వద్ద నిర్మాణాలు పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లగా…చంద్రబాబును, టీడీపీ నేతలను ఎండాడ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ నిర్మాణాలను సందర్శించేందుకు వెళుతున్న తనను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని చంద్రబాబు ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వం చేపట్టింది పర్యాటక ప్రాజెక్టే అయితే, దానికి అన్ని అనుమతులు ఉంటే అంత ఉలికిపాటు ఎందుకని జగన్ ను చంద్రబాబు నిలదీశారు. ఆనాడు పర్యటనకు ప్రభుత్వం సమ్మతించకపోవడంతోనే టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.
Comments 1