టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం వ్యవహారంలో ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ పాలకమండలిలో జగన్ అనుకూల వర్గం చాలామంది ఉన్నారని విమర్శలు వచ్చాయి. జగన్ తో జైలు జీవితం గడిపిన వారు, బడా బడా వ్యాపారవేత్తలు దాదాపు 9 మంది ఉన్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. దీంతో, టీటీటీ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ పై హైకోర్టు మండిపడింది. టీటీటీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. టీటీడీ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు.
ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు…కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అంతేకాదు, ఈ నియామకాలపై టీటీడీ, వైసీపీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ అన్నారు. టీటీడీ పాలకమండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్ మార్చారని, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు.
ఇప్పటికైనా జగన్ హిందూదేవాలయాల పవిత్రతను దెబ్బతీయకుండా, అర్హులైన వారికి మాత్రమే ఆగమశాస్త్రం ప్రకారం, ఆధ్యాత్మిక చింతన, అపారమైన భక్తిభావం ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించాలని రమేష్ డిమాండ్ చేశారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీయలన్న జగన్ కుట్రను హిందు సమాజం అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేవలం జగన్ రాజకీయ అవసరాల కోసం టీటీడీలో అనర్హులను చొప్పించడాన్ని బీజేపీ ఎన్నటికి సహించదని నాగోతు రమేష్ అన్నారు